Loans for babies: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో గతకొంత కాలంగా జనాభా రేటు తగ్గిపోతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇలా కొనసాగితే రానున్న కొన్నేళ్లలోనే యువ జనాభా శాతం తగ్గిపోగా.. వృద్ధుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. దీంతో మొన్నటివరకు 'ఒక్కరు ముద్దు-అసలే వద్దు' నినాదాన్ని పక్కనబెట్టి.. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండంటూ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా 'బేబీ లోన్' పేరుతో ఏకంగా రూ.25 లక్షల వరకూ బ్యాంకు రుణం ఇప్పించేందుకు చైనాలోని జిలిన్ ప్రావిన్సు సిద్ధమయింది.
జనాభాను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా చైనా పలు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా వివాహమైన దంపతులకు రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు జిలిన్ ప్రావిన్సు సిద్ధమైంది. వివాహమైన దంపతులకు 2 లక్షల యువాన్లు (దాదాపు రూ.25లక్షలు) రుణం ఇప్పించే ప్రతిపాదన రూపొందించింది. అయితే, ఈ సహాయం ఏ రూపంలో ఇస్తుందని విషయాన్ని మాత్రం వెల్లడించనప్పటికీ.. పిల్లల సంఖ్యను బట్టీ వడ్డీరేట్లలో భారీ డిస్కౌంట్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న దంపతులు ఏదైనా వ్యాపారం చేస్తే పన్నులో మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొంది. అంతేకాకుండా ప్రసూతి సెలవులను కూడా ఆరు నెలలకు పెంచడంతో పాటు పురుషులకు పితృత్వ సెలవులను పెంచనున్నట్లు అందులో పేర్కొంది.
Loans for babies in China: