తాలిబన్లు కాబుల్‌ను వశపరుచుకున్నారన్న వార్త తెలియగానే ఆ నగరంలోని చాలా ఇళ్ల తలుపులు తెరుచుకోలేదు. ముఖ్యంగా మహిళలు ఉన్న కుటుంబాలైతే బయటకెళ్లే సాహసం చేయలేదు. అలాంటి ఓ కుటుంబమే సలేక్‌ది.
ఆ రోజు..
అది సోమవారం. ఇంట్లో వారందరూ అవకాశం చిక్కితే దేశం ఎలా దాటాలో అన్న చర్చల్లో తలమునకలై ఉంది. ఇంతలో మేడపై పేద్ద శబ్దం. కొంపదీసి.. బాంబా? ఒకవేళ బాంబే అయితే ఈ పాటికే మనమంతా తునాతునకలైపోయేవాళ్లం కదా అని అందులో ఒకరన్నారు. మరేమై ఉంటుంది? ఒక్క క్షణం నిశ్శబ్దం. ట్రక్కు టైర్ ఏమైనా పేలిందా? అయినా మేడమీద నుంచి శబ్దం ఎలా వస్తుంది? ఇంట్లో వాళ్లెవరూ కొంతసేపటి వరకు పైకెళ్లే సాహసం చేయలేదు. కాసేపటికి ఇంటి పెద్ద ఓ రెండడుగులు ముందుకు.. ఓ అడుగు వెనక్కు వేసుకుంటూ ముందుకు సాగాడు. తన వెంటే అతడి భార్య కూడా నడిచింది. అనుకోనిది ఏదైనా జరిగినా భర్తతో పాటే తానూ అనుకుంటూ! మేడపైకి చేరుకున్న కాసేపటికే అక్కడి దృశ్యాలు చూసి ఆమె మూర్ఛపోయింది. నెత్తుటి వర్షమేమైనా కురిసిందా అన్నట్లు పడి ఉన్న రక్తపు మరకలు.. విడి శరీర భాగాలు దర్శనమిచ్చాయి. ఆ దృశ్యాలను చూసిన సలేక్‌కు కూడా వెన్నులో వణుకు పుట్టింది. ఒక్కో అడుగుకు ఒక్కో ఛిద్రమైన భాగం కనిపిస్తుంటే ఒళ్లు కంపించింది. ఇంకెవరు ఈ దృశ్యాలు చూసినా వాళ్లకీ ఇదే పరిస్థితి అనుకుంటూ వెంటనే ఓ వస్త్రాన్ని తీసి కప్పాడు. ఆ భాగాలను మత పెద్దలకు అప్పగించాడు. వాటిని వారు ఖననం చేసేందుకు తీసుకెళ్లారు. ఇంతలో 'ఇందాకే టీవీలో చూశా.. ఓ ఇద్దరు విమానం నుంచి కింద పడిపోయారట' చెప్పుకొచ్చాడు పక్కింటాయన. అప్పుడు సలేక్‌కు తెలిసింది తన ఇంటి మేడపై నుంచి కింద పడింది వారిద్దరేనని!!
-ఇదీ కాబుల్‌లోని 49 ఏళ్ల వాలి సలేక్‌కు సోమవారం ఎదురైన పరిస్థితి. అఫ్గానిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితిని టీవీల్లో చూసేవారికి ఈ సన్నివేశ వర్ణన కూడా తక్కువగానే అనిపించొచ్చు.