Russia Ukraine news: రష్యా భద్రతాబలగాలను దేశం బయట వినియోగించేందుకు రష్యా పార్లమెంటు ఓకే చెప్పింది.
ఈ మేరకు చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. మరో వైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఉక్రెయిన్ రష్యా అనుసరిస్తున్న విధానాన్ని అమెరికా తప్పుపట్టింది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం మోహరింపులను 'దండయాత్ర'గా పేర్కొంది. అయితే మాస్కో ఇప్పటికే రెడ్ లైన్‌ను దాటిందని అన్నారు.
క్రిమియా రష్యాలో భాగమే..
ఉక్రెయిన్‌పై పాశ్యాత్య దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని రష్యా అధ్యక్షుడు తప్పుబట్టారు. తమ దేశంలో భాగంగా క్రిమియాను అంతర్జాతీయంగా గుర్తించాలని, నాటో సభ్యత్వానికి ఉక్రెయిన్ స్వస్తి పలకాలని , ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని కోరారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తించడం.. అక్కడికి రష్యా సేనలను పంపించాలని ఆదేశించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. అయితే.. ఈ వివాదంపై ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని రష్యా ఓ ప్రకటన చేసింది. తమ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నారని మంగళవారం తెలిపింది. 'అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ చెబుతున్నాం.. మేం చర్చలకు సిద్ధమే' అని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా వ్యాఖ్యానించారు. తాము ఎల్లప్పుడూ దౌత్య పరిష్కారాలకు అనుకూలంగా ఉంటామని తెలిపారు.
ఉక్రెయిన్ విషయంలో రష్యా చర్యలను బ్రిటన్ సహా పలు దేశాలు ఖండిస్తున్నాయి. పుతిన్ నిర్ణయాలను తప్పుబట్టిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీ ఛాన్స్‌లర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు సైతం రష్యా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:
దూకుడు పెంచిన రష్యా- కళ్లెం వేసే యత్నాల్లో ప్రపంచ దేశాలు