హాంకాంగ్ చట్ట సభ రణరంగంగా మారింది. చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరిగణించే బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య అనుకూల సభ్యులు ఆందోళన నిర్వహించారు. చైనాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని నినదించారు. సభను అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. బురద మట్టిని తీసుకొచ్చి సభలో వెదజల్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్రయత్నాన్ని నిలువరించారు.
ప్రజాస్వామ్యం?
రణరంగంగా మారిన హాంకాంగ్ చట్ట సభ ఓ సభ్యుడు సభాధ్యక్షురాలు స్టారీ లీని అగౌరపరుస్తూ సంజ్ఞ చేశాడు. చట్టవిరుద్ధమైన అధ్యక్షురాలు అంటూ దూషించాడు. ఇంకొక చట్ట సభ్యుడు సభ మొత్తం కలియ తిరుగుతూ భద్రతా సిబ్బందికి దొరక్కుండా నానా తిప్పలు పెట్టాడు. సభలో వేసిన బల్లల కింద దాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆందోళనను విరమించని ముగ్గురు సభ్యులను భద్రతా సిబ్బంది... బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. సభను అడ్డుకున్న ముగ్గురు ప్రజాస్వామ్య అనుకూల సభ్యులను హాంకాంగ్ చట్ట సభ ఛైర్‌పర్సన్ స్టారీ లీ సభ నుంచి బహిష్కరించారు. ఇప్పటికే హాంకాంగ్ హక్కులను కాలరాస్తున్న చైనా జాతీయ భద్రతా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజాస్వామ్య అనుకూల వాదులు తాజాగా తీసుకొచ్చిన చట్టాన్ని సైతం ప్రతిఘటిస్తున్నారు.
ఇదీ చూడండి:చైనా భద్రతా చట్టంపై చర్చించాలని ఐరాసకు అమెరికా పిలుపు