ఉగ్రదాడులు జరిగిన రెండు వారాల తర్వాత శ్రీలంకలో రేపు(సోమవారం) నుంచి భారీ భద్రత నడుమ పాఠశాలలు, కళాశాలు పునఃప్రారంభం కానున్నాయి. దేశంలో ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా విద్యాసంస్థలను మూసివేశారు.
రేపు 6 నుంచి 13 వరకు..
6 నుంచి 13 తరగతులు రేపటి నుంచే ప్రారంభం కానుండగా, 1 నుంచి 5 తరగతులు ఈ నెల 13 తేదీన మొదలవుతాయి.
పటిష్ఠ భద్రత
పాఠశాల ప్రాంగణాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి అఖిల విరాజ్ కరియవాసం తెలిపారు. విద్యాలయాల సమీపంలో వాహనాలు నిలపకుండా పూర్తి నిషేధం విధించామన్నారు. పాఠశాలలకు చెందిన వాహనాలు ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. భద్రతా చర్యల్లో త్రివిధ దళాలు, పోలీసులు, ప్రత్యేక టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొంటారని మంత్రి స్పష్టం చేశారు.
మరిచిపోలేని విషాదం
ఏప్రిల్ 21 ఈస్టర్ ఆదివారం రోజున చర్చిలు, ఐదు నక్షత్రాల హోటళ్లే లక్ష్యంగా తొమ్మిది మంది ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ నరమేథంలో 253 మంది మరణించగా, సుమారు 500 మంది క్షతగాత్రులయ్యారు.
ఉగ్రదాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించుకుంది. అయితే శ్రీలంక ప్రభుత్వం మాత్రం స్థానిక నేషనల్ తౌవీద్ జమాత్(ఎన్టీజే)ను అనుమానిస్తోంది. ఆ సంస్థను ఇప్పటికే నిషేధించింది ప్రభుత్వం. ఇప్పటివరకు 100 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది.
ఇదీ చూడండి: గాజా రాకెట్ల దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం