లంక రాజకీయం: తమ్ముడు దేశాధ్యక్షుడు- అన్న ప్రధాని శ్రీలంక అధ్యక్షుడిగా గొటబాయ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని పదవికి రాజీనామా చేశారు రణిల్ విక్రమసింఘే. ఆ వెంటనే తన సోదరుడు మహీంద రాజపక్సను ప్రధానిగా ప్రకటించారు గొటబాయ.
రేపే బాధ్యతలు..
విక్రమసింఘే పదవి నుంచి గురువారం అధికారికంగా వైదొలగనున్నారు. అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత మహీంద రాజపక్స.
మెజారిటీ ఉన్నప్పటికీ..
అధ్యక్షుడు గొటబాయతో మంగళవారం భేటీ అయ్యారు విక్రమసింఘే. శ్రీలంక పార్లమెంట్ భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. పార్లమెంటులో తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సకు ఇచ్చిన మాటను గౌరవించి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు సింఘే. 'అధ్యక్షుడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసేందుకు పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. రేపు అధికారికంగా నా నిర్ణయాన్ని అధ్యక్షుడికి తెలియజేస్తా' అని తెలిపారు సింఘే.
అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి సాజిత్ ప్రేమదాసపై గొటబాయ విజయం సాధించిన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని సింఘేపై ఒత్తిడి పెరిగింది.
2018లో అనిశ్చితి
2018 అక్టోబర్ 26న రణిల్ విక్రమ సింఘేకు షాక్ ఇస్తూ.. మహీంద రాజపక్సను ప్రధానిగా నియమించారు అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. ఆయన నిర్ణయం దేశాన్ని రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టింది. అనంతరం సుప్రీం కోర్టు ఇచ్చిన రెండు కీలక ఆదేశాలతో ఆ పదవికి రాజీనామా చేశారు మహీంద. పార్లమెంట్ రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం అక్రమమని తేల్చింది సర్వోన్నత న్యాయస్థానం.
ఇదీ చూడండి: ఈ నెల 29న భారత్కు శ్రీలంక నూతన అధ్యక్షుడు