తెలంగాణ

telangana

ETV Bharat / international

హఫీజ్​ సయీద్ అనుచరులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు

టెర్రర్​ ఫైనాన్సింగ్ కేసులో లాహోర్​ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిషేధిత జమాత్ ఉద్​ దవాకు(జేయూడీ) చెందిన ఆరుగురు నేతలను నిర్దోషులుగా ప్రకటించింది.

Hafiz Saeed
హఫీజ్​ సయీద్

By

Published : Nov 7, 2021, 10:06 AM IST

Updated : Nov 7, 2021, 11:09 AM IST

టెర్రర్​ ఫైనాన్సింగ్(ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం) కేసులో పాకిస్థాన్​ లాహోర్​ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2008 మంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అధినేతగా ఉన్న జమాత్ ఉద్​ దవాకు(జేయూడీ) చెందిన ఆరుగురు నేతలను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా తెలిపింది. నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే-తోయిబాకు(ఎల్​ఈటీ) అనుబంధ విభాగంగా జేయూడీ పని చేస్తోంది.

ఈ కేసులో మాలిక్ జాఫర్ ఇక్బాల్​, యహ్యా ముజాహిద్​, నస్రుల్లా, సైముల్లా, ఉమర్​ బహదూర్​కు ట్రయల్ కోర్టు తొలుత తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. హఫీజ్​ అబ్దుల్​ రెహమాన్​ మక్కీకి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే.. వారు ఈ తీర్పును సవాలు చేస్తూ లాహోర్ హైకోర్టు డివిజన్ బెంచ్​లో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మహమ్మద్​ అమీర్​ భట్టీ, జస్టిస్ తారిఖ్ సలీమ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

నిందితులపై మోపిన అభియోగానికి సంబంధించి సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రయల్​ కోర్టు సాక్ష్యాధారాలను సరిగ్గా పరిశీలించకుండానే నిందితులకు శిక్ష విధించిందని చెప్పారు. అల్​-అన్ఫాల్ ట్రస్టులో సభ్యులైన నిందితులకు లష్కరే తోయిబాతో ఏ సంబంధమూ లేదని పేర్కొన్నారు. అయితే.. ఎల్​ఈటీతో కలిసి నిందితులు పని చేస్తున్నారని అదనపు ప్రాసిక్యూటర్ జనరల్​.. ధర్మాసనానికి నివేదించారు.

వాదనలు విన్న ధర్మాసనం.. సరైన సాక్ష్యాధారాలు లేనందున నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

2008 ముంబయి ఉగ్రదాడులకు లష్కరే తోయిబానే పాల్పడింది. ఈ ఘటనలో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:ఇరాక్​ ప్రధానమంత్రిపై హత్యాయత్నం

Last Updated : Nov 7, 2021, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details