'మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టా ఉంటుందో తెలుసా'- ఓ తెలుగు సినిమా డైలాగ్ ఇది. అవును చిరుత గాండ్రింపు గంభీరం. ఎవరైనా వేగంగా పరిగెడితే చిరుతతో పోలుస్తారు. చిరుత పంజా విసిరితే వేట జీవి మట్టికరవాల్సిందే.
సాధారణంగా కష్టాలొస్తే మనుషులమైతే మరొకరి సాయం తీసుకుంటాం. గుంపు జీవులైతే ఎలాగోలా నెట్టుకొస్తాయి.అలాంటిది చిరుత గాయాలపాలై పరిగెత్తలేక పోతే... వేటాడే జంతువును భయపెట్టలేకపోతే... ఆకలితో అలమటిస్తే... ఇలాంటి పరిస్థితి వస్తే ఒంటరి జీవి చిరుత మాత్రం ఆకలితో మాడి మరణించాల్సిందే. అరుదైన కిర్గిజిస్థాన్ మంచు కొండ చిరుతల పరిస్థితి ఇప్పుడు ఇలానే మారింది. వీటి సంరక్షణ కోసం 'ఇస్సిక్ కుల్' కేంద్రం ఏర్పాటు చేసింది అక్కడి సర్కారు.
1990లో కిర్గిజిస్థాన్‌లో వంద మంచు పులులుండేవి. మానవులు వేటాడటం కారణంగా తగ్గుతూ వచ్చాయి. చిరుతల సంఖ్య తగ్గుతుందని గుర్తించిన ప్రభుత్వం... సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు మొగ్గు చూపింది. ఈ సంరక్షణ కేంద్రాన్ని జర్మనీకి చెందిన ప్రకృతి, జీవవైవిధ్య సమాఖ్య (నాబు) వారు ఏర్పాటు చేశారు. గాయపడిన మంచు చిరుతలకు చికిత్స అందిస్తారు సిబ్బంది. బయటకెళ్లి బతుకుతుందనుకుంటే వదులుతారు.
ఈ కేంద్రం ఏర్పాటుతో సత్ఫలితాలు అందుతున్నాయి. గత ఐదేళ్లలో చిరుతల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
"ఈ మంచు చిరుతల సంరక్షణ కేంద్రాన్ని 2002లో ఏర్పాటు చేశారు. మేం సంరక్షించిన మొదటి మంచు చిరుత పులులు అల్సౌ, బగిరా, కునాట్లు. వేటగాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న చిరుతలను సంరక్షించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుంది. మా సిబ్బంది వేటగాళ్లకు చిక్కిన చిరుతలను సంరక్షణ కేంద్రానికి తీసుకువస్తారు. 2002 నుంచి చిరుతలు మాతో ఉన్నాయి. వాటిని బయటకు వదిలితే స్వతహాగా ఆహారాన్ని సంపాదించుకోలేవు." -ఉర్లన్భాయ్ సులేమానోవ్, అటవీ అధికారి.