అమెరికాతో అణు నిరాయుధీకరణ చర్చలు విఫలమైన అనంతరం ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. శనివారం తక్కువ దూరంలోని లక్ష్యాల్ని ఛేదించే క్షిపణుల్ని పరీక్షించడం తమ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా ప్రకటించింది.
"హోడో ప్రాంతంలోని తూర్పు తీర పట్టణం వాన్సన్ నుంచి ఉత్తర కొరియా అధిక సంఖ్యలో స్వల్ప లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల్ని ప్రయోగించింది."
-దక్షిణ కొరియా
ఈ క్షిపణులు తూర్పు తీరం దిశగా, జపాన్ వైపు 70 నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయని దక్షిణ కొరియా వెల్లడించింది. 2017 నవంబర్లో చివరిసారి ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య వియత్నాం రాజధాని హనోయిలో జరిగిన రెండో దశ చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొరియా రెచ్చగొట్టే చర్యలకు దిగిందని తెలుస్తోంది. ఆంక్షలు సడలించాలంటే నిర్మాణాత్మకమైన అణు నిరాయుధీకరణ చేపట్టాలని దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి కాంగ్ క్యుంగ్ సూచించిన మరుసటిరోజే ఈ చర్యలకు దిగింది కిమ్ సర్కార్.