ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాల మధ్య భీకర ఘర్షణలు జరుగుతున్నాయి. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం.. ఇరు దేశాలు పరస్పర దాడులతో హడలెత్తిస్తున్నాయి.
వివాదాస్పద నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతం భౌగోళికపరంగా అజర్‌బైజాన్ దేశంలో ఉంది. అయినా అజర్‌బైజాన్ విధానాలను వ్యతిరేకించే ఆర్మేనియా బలగాలే 1994 నుంచి దానిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వేర్పాటువాదుల పోరాటం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తాజాగా సెప్టెంబర్ 27 నుంచి భీకర ఘర్షణలు కొనసాగుతున్నాయి. గతంలోనూ ఈ ప్రాంతంలో వివాదాలు, హింస చెలరేగిందిి. ఈ దేశాల మధ్య 2016 లోనూ భారీ పోరాటమే జరిగింది. ఆ సమయంలో దాదాపు 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది జులై నెలలో జరిగిన పోరులోనూ 16 మంది మరణించారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న స్థాయిలో విధ్వంసం ఎన్నడూ జరగలేదు.
పరస్పర దాడులు..
ఘర్షణల నేపథ్యంలో.. ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆర్మేనియా బలగాలే.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి దాడికి పాల్పడ్డాయని అజర్‌బైజాన్ రక్షణ శాఖ చెబుతోంది. అజర్‌బైజాన్ జరిపిన వాయు, ఫిరంగి దాడుల్లో అర్మేనియా హెలికాఫ్టర్లు, ట్యాంకులు ధ్వంసమయ్యాయని ఆరోపిస్తూ.. దేశంలో మార్షలా లా అమలులోకి తెచ్చినట్లు అర్మేనియా ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య కాల్పుల మోత మోగుతోంది. ఘర్షణలు అంతకంతకూ తీవ్రతరం అవుతూ.. యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆధిపత్యం కోసం పోరాటం
ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో అంతర్భాగమైన అర్మేనియా, అజర్‌బైజాన్... సాంస్కృతిక, మతపరమైన విభేదాల కారణంగా రెండు దేశాలుగా విడిపోయాయి. నాగోర్నో-కరాబాఖ్పై ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాయి.
దట్టమైన అడవులు, పర్వతాలతో నిండి ఉన్న ఈ ప్రాంతం గురించి 1988 నుంచి వివాదాలున్నాయి. సోవియట్ యూనియన్ పతనానికి ముందు.. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతం అజర్‌బైజాన్ నియంత్రణలో ఉండేది. అయితే, 1991లో ఈ ప్రాంతానికి స్వేచ్ఛ లభించింది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన 1992 యుద్ధంలో ఆర్మేనియా-అజర్‌బైజాన్ భీకరంగా పోరాడాయి. ఈ యుద్ధంలో దాదాపు 30,000 మంది చనిపోయారు. 1994లో యుద్ధం అంతిమ దశకు వచ్చేనాటికి వివాదస్పద ప్రాంతంతో పాటు... దాని సమీపంలోని మడగిజ్ను ఆర్మేనియా తన అధీనంలోకి తెచ్చుకుంది. అదే ఏడాది శాంతి చర్చల్లో భాగంగాా... ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ, ఉద్రిక్తతలు సమసిపోలేదు. ప్రాంతం అజర్బైజాన్లో ఉన్నా... పట్టు ఆర్మేనియన్లది ఉండటం సమస్యగా మారింది.
ఈ ప్రాంతం కాకసస్ పర్వతాల మధ్య.. 4,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఆర్మేనియా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.