చైనాలో పుట్టిన కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్నంతటినీ ఆవహించి విలయతాండవం చేస్తోంది. ఈ ప్రకంపన నుంచి బయటపడక ముందే చైనాలో మరో వ్యాధి బెంబేలెత్తిస్తోంది. వాయవ్య చైనాలోని లాంఝౌ ప్రాంతంలో బ్రుసెల్లొసిస్ అనే వ్యాధి ప్రబలుతోంది. ఇటీవల వేలాది మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గతేడాది ఓ బయోఫార్మాస్యుటికల్స్ సంస్థలో లీకేజీ ప్రమాదం తర్వాత బ్రుసెల్లోసిస్ వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధిని మాల్టా జ్వరం, మధ్యధరా జ్వరంగా పిలుస్తున్నారు. అక్కడి మీడియా కథనాల ప్రకారం ఈ వ్యాధి సోకిన వ్యక్తులకు తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఈ లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ దీని ద్వారా మరికొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) పేర్కొంది. ఆర్థరైటిస్, అవయవ వాపు వంటి కొన్ని లక్షణాలు దీర్ఘకాలిక సమస్యలుగా మారే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఒకరి నుంచి మరొకరికి ఇది సోకే అవకాశం చాలా తక్కువ అని స్పష్టం చేసింది. కలుషితమైన ఆహారం తీసుకోవడం లేదా గాలిలోని బ్యాక్టీరియాను పీల్చుకోవడం వల్లే చాలా మంది ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపింది.