తెలంగాణ

telangana

ETV Bharat / international

దక్షిణ కొరియాకు కిమ్​ సోదరి బెదిరింపులు - n korea threatens south korea

దక్షిణ కొరియాపై సైనిక చర్యలకు దిగుతామని బెదిరించారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్ సోదరి కిమ్​ యో జోంగ్​. ద్వైపాక్షిక సంబంధాలకు నిరాకరిస్తున్నారని, సరిహద్దులో ప్యాంగ్​యాంగ్​కు వ్యతిరేకంగా కరపత్రాలను ప్రదర్శిస్తున్న ఉద్యమకారులను దక్షిణ కొరియా కట్టడి చేయలేకపోతోందని ఆరోపించారు.

Kim Jong Un's sister threatens S Korea with military action
సైనిక చర్యలకు దిగుతామని దక్షిణ కొరియాకు కిమ్​ సోదరి బెదిరింపులు

By

Published : Jun 14, 2020, 5:15 AM IST

ఉత్తరకొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​కు శక్తిమంతమైన సోదరిగా ఖ్యాతి గడించిన కిమ్​ యో జోంగ్​.. దక్షిణకొరియా లక్ష్యంగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో తమదేశానికి వ్యతిరేకంగా కరపత్రాలతో ఆందోళనలను నిర్వహిస్తున్న వారిని దక్షిణ కొరియా నియంత్రించలేక పోతోందని, ద్వైపాక్షిక సంబంధాలకు నిరాకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దక్షిణ కొరియాను శత్రువుగా అభివర్ణించారు కిమ్ యో జోంగ్. సియోల్ వైఖరి మారకుంటే సరిహద్దు పట్టణం కాయ్​సోంగ్‌లో నిరుపయోగంగా ఉన్న ఇరుదేశాల అనుసంధాన కార్యాలయం కూలిపోతుందని హెచ్చరించారు. త్వరలోనే కాయ్​సోంగ్ కార్యాలయం కుప్పకూలడం దక్షిణ కొరియా వీక్షిస్తుందని చెప్పారు. దక్షిణ కొరియాపై తదుపరి చర్యలను సైన్యానికి వదిలేస్తామన్నారు యో జోంగ్. ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

సరిహద్దు ప్రాంతం కాయ్​సోంగ్​లోని ఇరుదేశాల అనుసంధాన కార్యాలయం కరోనా వ్యాప్తి కారణంగా జనవరిలో మూతపడింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్​ జే మధ్య.. ఇరుదేశాల సంబంధాల్లో పురోగతి దిశగా మూడు దఫాల్లో జరిగిన చర్చల అనంతరం కుదిరిన ఒప్పందాల్లో భాగంగా 2018లో దీనిని ఏర్పాటు చేశారు. ఉత్తర,దక్షిణ కొరియాల మధ్య సంబంధాల బలోపేతానికి మూన్ కృషి చేస్తున్నారు. కిమ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మధ్య అణు చర్చలపై సమావేశం ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమించారు మూన్ జే. అయితే ట్రంప్​, కిమ్​ మూడుసార్లు భేటీ అయినప్పటికీ.. ఉత్తరకొరియా అణు కార్యక్రమంపై ఇరుదేశాల వైఖరుల్లో ఎలాంటి మార్పు లేదు.

ఆగ్రహంతో...

ట్రంప్​తో అణు చర్చల విషయంలో పురోగతి సాధించలేదనే నిరాశతో ఇటీవలి కాలంలో దక్షిణ కొరియాకు అన్ని రకాల సహకారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఉత్తర కొరియా. ప్రభుత్వ, సైనిక సమాచార కమ్యూనికేషన్​ను బహిష్కరించనున్నట్లు గతవారమే హెచ్చరించింది. 2018లో ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని కూడా విరమించుకుంటామని వెల్లడించింది.

అణు నిరాయుధీకరణపై అర్థంలేని చర్చలను దక్షిణ కొరియా ఆపివేయాలని.. అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ అధికారి వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే కిమ్ సోదరి కూడా హెచ్చరికలు చేశారు.

ఉత్తర కొరియా హెచ్చరికలపై స్పందించింది దక్షిణ కొరియా. సరిహద్దులో నిరసనలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. కరపత్రాలు ఎగిరివేయకుండా నిషేదాజ్ఞలు విధించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. రెండు దేశాల సంబంధాల కోసం ప్రజాస్వామ్య విధానాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details