Kim Jong Un Wife: కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తరకొరియాకు అధినేత అయినప్పటికీ బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించడం మాత్రం చాలా అరుదే. ఆయనే కాదు కీలక బాధ్యతలు చూసుకునే ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతే. ఇటీవల కిమ్ భార్య రి సోల్ జు గత కొన్ని నెలలుగా కనిపించకుండా పోయారు. తాజాగా ఆమె ఓ థియేటర్లో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. దాదాపు ఐదు నెలల తర్వాత కిమ్ దంపతులు బహిరంగంగా కనిపించడంతో అక్కడి ప్రేక్షకులందరూ కేరింతలు, చప్పట్లతో ఆనందం వ్యక్తం చేసినట్లు అక్కడి అధికారిక మీడియా పేర్కొంది.
ఉత్తర కొరియా ప్రస్తుతం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా కిమ్ జోంగ్ ఉన్-రి సోల్ జు దంపతులు ఓ కళా ప్రదర్శనలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ వేదికపైకి వెళ్లి ప్రదర్శనకారులతో కలిసి ఫొటో దిగారు. ఆ సమయంలో ఆడిటోరియంలో ప్రేక్షకులు చప్పట్లతో కేరింతలు కొట్టినట్లు అక్కడి అధికారికి మీడియా వెల్లడించింది. అయితే, గతేడాది సెప్టెంబర్ 9న చివరిసారిగా ఆమె ఓ అధికారిక కార్యక్రమంలో కిమ్‌తో కలిసి కనిపించిన తర్వాత మరే కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. దీంతో ఆమె ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత మళ్లీ ఆమె ప్రత్యక్షం కావడంతో అక్కడివారందరూ ఆశ్చర్యంగా చూసినట్లు సమాచారం.