కిమ్ జోంగ్ ఉన్... ఉత్తర కొరియాను పాలిస్తున్న ఈ నియంత పేరు ఏదో రకంగా వార్తల్లో ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు పక్కనే ఉన్న దక్షిణ కొరియాకు హెచ్చరికలు చేయడం, అణ్వస్త్రాలను ప్రయోగించడం.. ఇలా విషయం ఏదైనా ఆయన వార్తల్లో ఉండాల్సిందే. ఒకవేళ కొద్దిరోజుల పాటు కిమ్ కెమెరా కంట పడకున్నా.. అదీ వార్తే అవుతుంది. కిమ్‌కు ఏమైందోనని విశ్లేషణలు వెల్లువెత్తుతుంటాయి. కొద్దిరోజుల క్రితం కిమ్ ఆరోగ్యం బాలేదంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత కిమ్ సన్నబడ్డారంటూ మరోసారి వార్తల్లోకెక్కారు.
ఇప్పుడు ఇలాగే కిమ్ మళ్లీ చర్చనీయాంశమయ్యారు. మరోసారి ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యేలా తలకు బ్యాండేజీతో దర్శనమిచ్చారు. జులై 24-27 మధ్య నిర్వహించిన కొరియా పీపుల్స్ ఆర్మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి ఫొటోల్లో కిమ్ తల వెనక భాగంలో బ్యాండేజీ కనిపించింది. జులై చివర్లో జరిగిన మరో కార్యక్రమంలో బ్యాండేజీ స్థానంలో ఆకుపచ్చ రంగులో ఓ మచ్చ కనిపించింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కిమ్‌కు ఏమైందని మరోసారి చర్చ ఊపందుకుంది.
కొరియా నేత కిమ్ ఆరోగ్య విషయాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు అక్కడి అధికారులు. ఆయన ఫొటోలు బయటకు రావడం కూడా చాలా అరుదు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తుంటారని అక్కడి మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది.