కేరళకు చెందిన థామస్ విజయన్.. నేచర్ ఫొటగ్రఫీలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. అత్యంత అరుదైన ఒరంగటాన్ను తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటోను సరిగ్గా గమనిస్తే తలకిందులుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ రావడానికి విజయన్ చాలా రోజులే శ్రమించాడు. ఒరంటగాన్లు అరుదుగా ఉండె బోర్నియో ఐలాండ్ వెళ్లాడు. తన మదిలో ఉన్న ఫ్రేమ్ వచ్చే వరకు వేచి చూశాడు. చివరకు అనుకున్నది సాధించాడు.
విజయన్ బంధించిన ఈ చిత్రం టీటీఎల్ నేచర్ ఫొటోగ్రఫీ-2021 పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. అతడికి బహుమతిగా 1,500 పౌండ్లు(రూ.1,50,000) దక్కాయి. మొత్తం 8,000 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్న ఈ పోటీలో తాను గెలిచినందుకు విజయన్ ఆనందం వ్యక్తం చేశాడు. అంతరించిపోతున్న ఒరంగటాన్ జాతిని కాపాడాలని ప్రపంచానికి సందేశం ఇచ్చేందుకు తను ఈ ఫొటోను చిత్రీకరించినట్లు చెప్పాడు.
"ఈ షాట్ కోసం నీటిలో ఉన్న ఒక చెట్టును ఎంచుకున్నాను. దాని వల్ల ఆకాశం, చెట్ల ఆకుల ప్రతిబింబం కనిపిస్తుంది. ఫలితంగా అద్దం ఎఫెక్ట్ ఏర్పుడుతుంది. ఫొటో తలకిందులుగా కనిపిస్తుంది . ఈ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాక నేను చెట్టుపైకి ఎక్కి గంటల కొద్దీ నిరీక్షించాను. చివరకు అనుకున్న విధంగా ఒరంగటాన్ ఫొటోను బంధించాను." అని విజయన్ అన్నాడు. తన శ్రమకు తగ్గ ఫలితం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఫొటోకు 'ద వరల్డ్ ఈస్ గోయింగ్ అప్సైడ్ డౌన్' అని క్యాప్షన్ పెట్టాడు.