Kazakhstan unrest: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కజికిస్థాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు.. హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం సహా 12 మంది పోలీసులు మరణించారు. అందులో.. ఓ పోలీసు అధికారి తలను నిరసనకారులు నరికేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారులు తెలిపారు.
Kazakhstan fuel price protests: పెట్రో ధరల పెంపుపై నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు.. అల్మాటీ నగరంలోని మేయర్ భవనం సహా పలు ప్రభుత్వ భవనాలను దగ్ధం చేసేందుకు బుధవారం రాత్రి యత్నించారని పోలీసు అధికార ప్రతినిధి సల్తానత్ అజెరిక్ తెలిపారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణల్లో నిరసనకారులతో పాటు పలువురు పోలీసులు మరణించారని చెప్పారు.
స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి కజకిస్థాన్‌లో గత మూడు దశాబ్దాలుగా వివిధ ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కజకిస్థాన్‌కు రష్యా నేతృత్వంలోని సైనిక కూటమి, ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటి ఆర్గనైజేషన్... తమ శాంతి పరిరక్షక దళాలను పంపుతామని గురువారం ప్రకటించింది.