జమ్ముకశ్మీర్‌లో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనేందుకు తిరుగులేని ఆధారం లభించింది. భారత సైన్యంతో పోరాడటానికి కశ్మీరీలకు పాకిస్థాన్‌లో శిక్షణ ఇచ్చినట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒప్పుకున్నారు.
గతంలో ఓ ముఖాముఖిలో ఈ విషయం వెల్లడించారు ముషారఫ్. ఆ వీడియోను పాక్ రాజకీయ నేత పర్హాతుల్లా బాబర్ ఇప్పుడు ట్విట్టర్లో షేర్ చేశారు.
"అఫ్గానిస్థాన్ నుంచి సోవియట్‌ను బయటకు పంపేందుకు, పాకిస్థాన్‌కు లబ్ధి చేకూర్చేందుకు 1979లో అఫ్గాన్‌లో మతపరమైన ఉగ్రవాదానికి బీజం వేశాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని తీసుకొచ్చాం. వారికి శిక్షణ ఇచ్చాం. ఆయుధాలు సరఫరా చేశాం. వారు మా దృష్టిలో వీరులు. హక్కానీ, ఒసామా బిన్ లాడెన్ వీరులు. వాతావరణం అప్పటితో పోల్చితే ఇప్పుడు మారింది. హీరోలు విలన్లు అయ్యారు. కశ్మీర్ నుంచి ఇక్కడికి వచ్చిన వారికి ఘన స్వాగతం లభించేది. వారికి మేము శిక్షణ ఇచ్చేవాళ్లం. భారత సైన్యంపై పోరాడే వీరులుగా మేము వారిని పరిగణించేవాళ్లం. తర్వాత లష్కరే తొయిబా వంటి ఎన్నో ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి."
-పర్వేజ్ ముషారఫ్, పాక్ మాజీ అధ్యక్షుడు
ఇదీ చూడండి : పండిట్ నెహ్రూకు ట్విట్టర్ వేదికగా మోదీ నివాళి