తెలంగాణ

telangana

ETV Bharat / international

తాలిబన్ల మెరుపువేగం వెనక ఆ 'ఒక్కడు' - mirwais yasini with taliban

అఫ్గాన్​ను ఆక్రమించేందుకు 9 నెలలు పడుతుందన్న అమెరికా అంచనాలను.. తాలిబన్లు రోజుల వ్యవధిలోనే పటాపంచలు చేశారు. మెరుపు వేగంతో దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. అయితే తాలిబన్ల వేగం వెనక ఓ కీలక వ్యక్తి ఉన్నారు. అష్రఫ్ ఘనీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ఆయన.. తాలిబన్లతో చేతులు కలపడమే ఇందుకు కారణం.

mirwais yasini with taliban
తాలిబన్ల ఆక్రమణ వేగం వెనక ఆ 'ఒక్కడు'

By

Published : Aug 23, 2021, 6:37 PM IST

నెల రోజుల క్రితం.. అమెరికా బలగాలు నెమ్మదిగా అఫ్గాన్​ను విడిచి వెళ్తున్న దృశ్యాలు; తాలిబన్లు అఫ్గాన్​ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు 9 నెలలు పడుతుందని నిఘా వర్గాల అంచనాలు వెలువరించిన సమయం; అధ్యక్షుడు బైడెన్ క్యాంప్ డేవిడ్​లో సమ్మర్ హాలిడే ప్లాన్లు వేసుకుంటున్న రోజులవి.

అదేసమయంలో, ఒక్కొక్కటిగా మొదలుపెట్టి.. కీలక నగరాలన్నీ తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు తాలిబన్లు. నిఘా వర్గాల అంచనాలను పటాపంచలు చేస్తూ.. అతికొద్ది రోజుల్లోనే మెరుపువేగంతో దేశాన్ని ఆక్రమించేశారు. ఈ వేగాన్ని చూసి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఆగస్టు 15న కాబుల్​ను హస్తగతం చేసుకోవడంతో వీరి దురాక్రమణ పూర్తైంది. అయితే, అమెరికా అంచనాలను మించిన వేగంతో దేశాన్ని చేజిక్కిచ్చుకోవడం వెనక ఓ కీలక వ్యక్తి ఉన్నారు. ఆయనే.. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన 'మిర్వాయిస్ యాసినీ'.

కాబుల్​లో తాలిబన్ల పహారా

తాలిబన్ పాలనను తీవ్రంగా విమర్శిస్తూ, ఘనీ వెన్నంటే నడిచిన యాసినీ.. తాలిబన్లతో చేతులు కలపగానే వారి దురాక్రమణ వేగం పుంజుకుంది. ఈ వెంటనే.. ఈ ప్రభావం వాషింగ్టన్ డీసీలో కనిపించింది. తాలిబన్లతో యాసినీ కలిసిపోయారన్న వార్త తెలియగానే.. అదనంగా మూడు వేల మంది సైన్యాన్ని కాబుల్​కు అమెరికా పంపించింది. అత్యవసర తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది.

తుపాకులు పట్టుకొని ఫొటోలకు ఫోజులిస్తూ...

ఎవరీ యాసినీ?

అఫ్గానిస్థాన్ పార్లమెంట్ దిగువ సభ డిప్యూటీ స్పీకరే ఈ మిర్వాయిస్ యాసినీ. అష్రఫ్ ఘనీకి అత్యంత సన్నిహితుడు. మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయికి నమ్మకస్తుడు. 16 ఏళ్ల వయసులోనే తుపాకీ పట్టిన చరిత్ర యాసినీది. 1979లో సోవియట్ యూనియన్​పై పోరాడినవారిలో ఈయన ఒకరు. అనంతరం 1986లో పైచదువుల కోసం పాకిస్థాన్​కు వెళ్లారు. 1993లో ఇస్లామాబాద్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. ఆ తర్వాత ఇస్లామిక్ లా, పొలిటికల్ సైన్స్​లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1996-2001 మధ్య తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు. రెడ్ క్రిసెంట్ సొసైటీ తరపున పనిచేశారు. ఆర్థిక శాఖలో పనిచేశారు. 2005 వరకు నార్కోటిక్స్ నిరోధక శాఖకు డిప్యూటీ మంత్రిగా సేవలందించారు. 2009లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు.

తాలిబన్లతోనే ముప్పు ఉందని చెప్పి..

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోలిస్తే, తాలిబన్లతోనే దేశ భద్రతకు అధిక ముప్పు ఉందని గతంలో ఓసారి చెప్పుకొచ్చారు యాసినీ. అలా ఎప్పటికప్పుడు తాలిబన్లను వ్యతిరేకించిన ఆయన.. ఏ పరిస్థితుల్లో వారికి వంతపాడారనే విషయంపై స్పష్టత లేదు. అయితే తాలిబన్లు మాత్రం ఆయనకు కీలక బాధ్యతలనే అప్పగించారు. రాజధాని కాబుల్ భద్రత వ్యవహారాలు చూసే బాధ్యత యాసినీ చేతిలో పెట్టినట్లు సమాచారం.

తాలిబన్ల మార్చ్

తాలిబన్ల అరాచక పాలన

ఆగస్టు 15న కాబుల్​లోకి ప్రవేశించిన తాలిబన్లు.. మరుసటి రోజు యుద్ధం ముగిసిందంటూ ప్రకటించారు. ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు ప్రారంభించారు. ఓ కౌన్సిల్ ద్వారా పాలన సాగిస్తామన్న సూచనలు వెల్లడించారు. మహిళల హక్కులకు భరోసా ఉంటుందని చెప్పినా.. అనేక చోట్ల తాలిబన్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనకారులపై కాల్పులకు తెగబడుతున్నారు.

(సంజీవ్ కే బారువా- సీనియర్ పాత్రికేయులు)

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details