కాబుల్ విమానాశ్రయం వద్ద గత నెల జరిగిన ఆత్మహుతి దాడిపై(kabul airport bomb blast).. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన భారత విభాగం "వలియత్ హింద్" సంచలన వివరాలు బయటపెట్టింది. ఆత్మహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ఐదేళ్ల ముందు దిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్టు వెల్లడించింది. 'కశ్మీర్' కోసం భారీ ప్రతికార దాడులకు ప్రణాళికలు రచిస్తుండగా అతడు పోలీసులకు చిక్కాడని.. ఆ తర్వాత అధికారులు అతడిని అఫ్గాన్ సైన్యానికి అప్పజెప్పారని.. తన మేగజైన్ "సావత్ అల్- హింద్"లో రాసుకొచ్చింది.
ఆగస్టులో.. తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్ సంక్షోభం ముదిరింది. దేశాన్ని వీడేందుకు ప్రజలు భారీ సంఖ్యలో కాబుల్ విమానాశ్రయానికి తరలివెళ్లారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఆగస్టు 26న అదును చూసుకుని.. అబ్బే గేట్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడింది ఐసిస్-కే(ఖొరసన్)(isis khorasan). ఈ ఘటనలో 250మందికిపైగా మరణించారు. వీరిలో 13మంది అమెరికా సైనికులు, తాలిబన్ ఫైటర్లు కూడా ఉన్నారు.
ఇదీ చూడండి:-ISIS khorasan: 'ఐసిస్-కే'కు రూ.వేల కోట్ల నిధులు ఎలా వచ్చాయ్?
మేగజైన్ కథనం ప్రకారం...
అఫ్గాన్‌లోని లగోర్ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల అబ్దుల్ రహ్మాన్ అల్-లగోరి.. ఆత్మహుతి దాడికి(kabul airport blast) పాల్పడ్డాడు. అతడు 25ఏళ్ల వయస్సులో భారత్‌కు వచ్చాడు. ఇంజినీరింగ్ కోసం దిల్లీ-ఫరిదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో పేరు నమోదు చేసుకున్నాడు. వాస్తవానికి.. రహ్మాన్ భారత్‌కు వచ్చింది.. కశ్మీర్ విషయంలో భారత్‌పై ప్రతికారం తీర్చుకోవడం కోసమే. దిల్లీకి వచ్చిన కొద్ది రోజులకే వేట మొదలుపెట్టాడు రహ్మాన్. రద్దీ ప్రాంతాలను జల్లెడ పట్టి.. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాడు. ఆత్మహుతి దాడి కోసం ప్రణాళికలు రచించాడు.
రహ్మాన్‌ను పట్టుకునేందుకు 'రా' రంగంలోకి దిగింది. 18నెలల పాటు అతడిపై నిఘా పెట్టింది. ఓ 'వ్యక్తి'ని బరిలోకి దింపి.. రహ్మాన్‌తో దగ్గరయ్యేలా చేసింది. ఆ వ్యక్తిపై నమ్మకంతో రహ్మన్.. దిల్లీలోని లజ్‌పత్ నగర్లో ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాడు. అక్కడే 2017 సెప్టెంబర్‌లో పోలీసులు రహ్మాన్‌ను పట్టుకున్నారు.