జపాన్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీకే(LDP) ప్రజలు మరోసారి పట్టంగట్టారు. మొత్తం 465 సీట్లకు విజయానికి 233 అవసరం కాగా.. LDP కూటమి 293 చోట్ల గెలుపొందింది. ఆ పార్టీ స్వతహాగా 261 స్ధానాలు దక్కించుకుంది.
ఇది గొప్ప విజయమని, ప్రజలు తమపై ఉంచిన పెద్ద బాధ్యత అని విజయం అనంతరం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా అన్నారు. సగానికిపైగా ఓట్లు తమకే వచ్చాయని స్పష్టం చేశారు.
ఫలితాల అనంతరం సరికొత్త పెట్టుబడిదారీ విధానం ద్వారా జపాన్ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోయాల్సిన అవసరముందని కిషిదా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారోనని అయోమయం నెలకొంది.
ప్రపంచంలో మూడో అతిపెద్దదైన తమ ఆర్థిక వ్యవస్థ స్తబ్దతతో మునిగిపోకుండా ఉండాలంటే దేశ సంపదను మరింత సమానంగా పంపిణీ చేయాల్సిన అసవరం ఉందని కిషిదా అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు వినడానికి బాగున్నా.. అనూహ్య మార్పులకు ఆయన సానుకూల వైఖరితో ఉండరని నిపుణులు చెబుతున్నారు.
'కిషిదా గత దశాబ్దంలోని మార్కెట్ అనుకూల విధానాలకు దూరంగా ఉండే అవకాశం లేదు. 2012 చివరి నుంచి 2020 మధ్యకాలం వరకు పదవిలో కొనసాగిన మాజీ ప్రధాని షింజో అబే హయాంలో.. సెంట్రల్ బ్యాంక్ భారీగా రుణాలు ఇవ్వడం, ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. అబే వారసుడు, యోషిహిడే సుగా కుడా పాత విధానాలకే అతుక్కుపోయారు. ఇప్పుడు కిషిదా ఏం చేస్తారోనని జపాన్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆయన ఆర్థిక విధానాల మర్మం ఏంటో అంతుపట్టడం లేదు" అని జపాన్ అర్థిక నిపుణుడు కినుకో కువబారా పేర్కొన్నారు.
ట్యాక్స్‌పై వెనక్కి..
ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆర్థిక అసమానతలను తిరిగి సమతుల్యం చేసేందుకు మూలధన లాభాలపై పన్ను పెంచడం దోహదపడుతుందని తాను నమ్ముతున్నట్లు కిషిదా చెప్పారు. సంపద అసమానత జపాన్‌లో కంటే అమెరికాలో గణాంకపరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, OECD డేటా ప్రకారం అమెరికన్లు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. అందుకే జపాన్‌లో పేదరికం సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా ఒంటరి తల్లులు జీవన వేతనం కోసం కష్టపడుతున్నారు. అయితే పన్ను పెంచుతామని కిషిదా చేసిన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చుపాయి. దీంతో ట్యాక్స్ ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు కిషిదా చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా తయారైనప్పుడు దీని గురించి ఆలోచిస్తానన్నారు.
జపాన్ పార్లమెంట్‌కు(దిగువసభ) ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఎల్డీపీ కూటమికి 293 సీట్లు రాగా.. ప్రతిపక్ష కాన్స్టిట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీ(CDP) కేవలం 96 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పీడీపీపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, కరోనా నియంత్రణలో విఫలమైందని, ఆర్థిక అభివృద్ధికి సంస్కరణలు తీసుకొస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షం జోరుగా ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి జపాన్‌లో LDPనే అధికారంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి:'ఆర్థిక సాయం విస్మరించి ఆ దేశాలపై ఒత్తిడి తగదు'