సుదూర గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాలతో జపాన్ క్యాప్సూల్ ఆదివారం విజయవంతంగా భూమికి చేరింది. ఈ ప్రయోగం విజయవంతం కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు జపాన్ అంతరిక్ష కేంద్రం అధికారులు, శాస్త్రవేత్తలు. ఈ అద్భుత క్షణాల కోసం ఆరేళ్లు ఎదురుచూసినట్లు చెప్పారు. వాటిలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నామని వెల్లడించారు. ఇంతకీ.. ఈ నమూనాల ద్వారా ఏం తెలుసుకోనున్నారు? ఈ ప్రాజెక్టు ఏ విధంగా సాగింది?... ఓసారి పరిశీలిద్దాం.
ప్రాజెక్ట్ సాగిందిలా..
భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి నమూనాల సేకరణకు జపాన్.. 2014లో హయబుసా-2 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. అది 2018లో ఆ ఖగోళ వస్తువును చేరింది. ఏడాదిన్నర పాటు అక్కడే ఉండి పరిశోధనలు సాగించింది. గత ఏడాది ఈ వ్యోమనౌక.. రియూగు ఉపరితలం, లోపలి పొరల నుంచి నమూనాలను సేకరించింది. అనంతరం విశ్వంలో ఏడాది పాటు ప్రయాణించి శనివారం.. భూమికి చేరువైంది. పుడమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. గ్రహశకల నమూనాలతో కూడిన క్యాప్యూల్‌ను హయబుసా-2 విడిచిపెట్టింది. ఇది ఆదివారం తెల్లవారు జామున.. భూవాతావరణంలోకి (120 కిలోమీటర్ల ఎత్తులో) ప్రవేశించింది. గాలి రాపిడి వల్ల తలెత్తిన వేడితో అది అగ్నిగోళంగా మారింది. అయితే.. ఉష్ణకవచం సాయంతో ఈ దశను అధిగమించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు క్యాప్సూల్‌లోని పారాషూట్ విచ్చుకొని, వేగాన్ని తగ్గించింది.
ఆస్ట్రేలియాలోని వూమెరాలో.. పెద్దగా జనావాసాలు లేని ప్రాంతంలో ఆదివారం ఉదయం ల్యాండ్ అయింది క్యాప్సూల్. తాను దిగిన ప్రాంతాన్ని తెలియజేస్తూ జపాన్ శాస్త్రవేత్తలకు సంకేతాలు పంపించింది. వీటిని అందుకోవడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో శాటిలైట్ యాంటెన్నాలను ఏర్పాటు చేశారు. ల్యాండింగ్ ఘట్టం కోసం 70 మందికిపైగా జపాన్ శాస్త్రవేత్తలు కొద్ది రోజులుగా విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్యాప్సూల్ వెడల్పు 40 సెంటీమీటర్లే. అందువల్ల రెండు గంటలపాటు గాలింపు జరిపిన అనంతరం హెలికాప్టర్ బృందాలు దీన్ని సేకరించగలిగాయి.
ఈ క్యాప్యూల్పై ఆస్ట్రేలియాలోని ఓ ల్యాబ్‌లో ప్రాథమిక భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వచ్చేవారంలో జపాన్‌కు తరలిస్తారు.
శాస్త్రవేత్తల మాటేంటి?
గ్రహశకల నమూనాల విశ్లేషణ ద్వారా సౌర కుటుంబం, పుడమి పుట్టుక వివరాలతోపాటు జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలక అంశాలను వెలుగులోకి తీసుకురావొచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. రియూగు నమూనాలు.. 50 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాలోని ముర్చిసన్లో పడిన ఒక ఉల్కను పోలి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ఉల్కలో సాధారణ జీవపదార్థాలైన అమైనో ఆమ్లాలతో పాటు పుష్కలంగా నీరు ఉందని చెప్పారు. రియూగు నమూనాల్లోనూ జీవ పదార్థాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
" అంతరిక్ష రేడియోధార్మికత, ఇతర వాతావరణ ప్రభావాలు లేని గ్రహశకల నమూనాల్లో విలువైన సమాచారం ఉందని భావిస్తున్నాం. సౌర వ్యవస్థలో పదార్థాలు ఎలా ఉంటాయి, భూమిపై జీవానికి ఎలా కారణమయ్యాయని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. నమూనాల పరిశీలనతో.. సౌర కుటుంబం మూలాలు, భూమికి నీరు ఎలా వచ్చింది అని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందనే మా నమ్మకం. "