ఓవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు ఊపిరిపీల్చుకుంటుంటే.. వెలుగులోకి వస్తున్న కరోనా వైరస్ కొత్త రకాలు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా, అమెరికాలో రూపం మార్చుకున్న మహమ్మారిని గుర్తించారు. తాజాగా జపాన్‌లో వీటన్నింటికీ భిన్నమైన మరో వైరస్‌ను నిర్ధరించారు. బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు జపాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
జపాన్‌లో కరోనా కొత్త వెర్షన్- ప్రపంచం పరేషాన్ - జపాన్‌లో కొత్త వైరస్
కరోనా కొత్త రకాలు ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా, అమెరికాలో రూపం మార్చుకున్న వైరస్‌ను గుర్తించారు. ఇప్పుడు జపాన్‌లో భిన్నమైన వైరస్ ఉన్నట్లు తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులకు జపాన్ ఈ విషయాన్ని తెలియజేసింది. దీనిపై సమగ్ర జన్యువిశ్లేషణ జరపాలని కోరింది. అలాగే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఏ మేర ప్రభావం చూపుతాయో తెలపాలని కోరింది. వైరస్ గుర్తించిన వ్యక్తుల్లో తొలుత ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. కానీ, క్రమంగా ఓ వ్యక్తికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తడం వల్ల ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు జరిపారు. కరోనా కొత్త రకం అని నిర్ధరణయింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా వేరియంట్ల కంటే భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. మరో వ్యక్తిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి.
జపాన్‌లో ఇప్పటి వరకు 30 మందిలో బ్రిటన్, దక్షిణాఫ్రికా వేరియంట్లను గుర్తించారు. కొత్త రకం కరోనా వేగంగా వ్యాపిస్తుండడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. టోక్యో నగరంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇక ఆ దేశంలో ఇప్పటి వరకు 2,80,000 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 4000 మంది మరణించారు.