జపాన్ ప్రధానిని నిర్ణయించే ఆ దేశ దిగువ సభకు ఎన్నికలు (Japan Election 2021) ప్రారంభయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. నెల రోజుల క్రితం ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన ఫుమియో కిషిడాకు ఈ ఎన్నికలు (Japan Election news) కీలకం కానున్నాయి. 465 సీట్లు ఉన్న జపాన్ పార్లమెంట్ దిగువ సభలో.. మెజార్టీ కోసం 233 స్థానాలు అవసరం. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ.. మునుపటికన్నా కొన్ని సీట్లు కోల్పోయినప్పటికీ మెజార్టీకి మాత్రం డోకా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అక్టోబర్ 4న ప్రధానిగా ఎంపికయ్యారు కిషిడా. పార్టీలో జరిగిన అంతర్గత ఎన్నికల్లో విజయం సాధించారు. జపాన్ ప్రధానిగా (Fumio Kishida party) తనదైన ముద్రవేసిన షింజో అబె, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టిన యొషిహిదె సుగాకు వారసుడిగా కిషిడాను సభ్యులు ఎన్నుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 15 రోజులకే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు ఉందో లేదోనని తెలుసుకునేందుకు ఎన్నికలకు వెళ్లారు.
ప్రచారం నిర్వహించుకునేందుకు 17 రోజుల స్వల్ప వ్యవధి మాత్రమే లభించింది. అంతకుముందు ఎల్డీపీ నాయకత్వ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో.. దేశ ప్రజల దృష్టంతా దానిపైనే ఉంది. ఇది విపక్షాలతో పోలిస్తే అధికార పార్టీకి కొంత అనుకూలించే అవకాశం ఉంది. ఇక ఎన్నికల ప్రచారం పూర్తిగా కరోనా మహమ్మారి చుట్టూనే జరిగింది. వైరస్‌పై మెరుగ్గా పోరాడామని అధికార పక్షం చెప్పుకోగా.. ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించలేకపోయారని విపక్షాలు ప్రచారం చేశాయి.