జపాన్లో 'హగీబిస్' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఈ తుపాను ధాటికి 11 మంది మృతి చెందగా.. 10 మందికి పైగా గల్లంతయ్యారు. మరో 100 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన ఆరు దశాబ్దాల కాలంలో అతి ఘోరమైన తుపాను ఇదేనని పేర్కొన్నారు.
హగీబిస్..
ఈ తుపానుకు 'హగీబిస్' అని నామకరణం చేశారు. హగీబిస్ అనగా ఫిలిప్పీన్స్లో 'వేగం' అని అర్థం. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. వరదల వలన జపాన్‌లోని పలు నదులు ఉప్పొంగుతున్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుంటం వల్ల నదీ పరివాహక ప్రాంతంలోని పలు ఇళ్లు కుప్పకూలాయి.
రైళ్ల రాకపోకలకు అంతరాయం...
తుపాను హెచ్చరికల నేపథ్యంలో పలు రైళ్లు నిలిపివేశారు. పట్టాలపై నీళ్లు భారీగా చేరాయి.
రగ్బీ ఆట..
తుపాను కారణంగా ఉత్తర జపాన్‌లోని కమైషిలో నమీబియా, కెనడా మధ్య జరగాల్సిన ప్రపంచ రగ్బీ కప్ మ్యాచ్ను అధికారులు రద్దు చేశారు.