ప్రమాదానికి గురైన ఫుకుషిమా అణు ప్లాంట్ నుంచి మిలియన్ టన్నుల వ్యర్థ జలాలను త్వరలో సముద్రంలోకి వదిలిపెట్టాలన్న జపాన్ ప్రభుత్వ నిర్ణయం విమర్శలకు దారితీస్తోంది. దీనిపై స్థానిక మత్స్యకార వర్గాలు, చైనా ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ ప్రక్రియ ఇప్పటి వరకు ముందుకు కదల్లేదు. వివాదాల కారణంగా కొన్నేళ్ల వరకు ముందుకెళ్లే పరిస్థితి లేదు. తాజాగా జపాన్ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే చైనా స్పందించింది. "ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమైన చర్య" అని మండిపడింది.
జపాన్ చర్యను అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ (ఐఏఈఏ) సమర్థించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అణుకేంద్రాల వద్ద జరిగే చర్యవంటిదే ఇది అని పేర్కొంది. దీనిపై జపాన్ ప్రధాని యషిహిడే సుగా మంత్రి మండలి సమావేశంలో మాట్లాడుతూ.. అణుకేంద్రాన్ని మూసేయాలంటే ఏళ్లు పట్టే చర్యలో ఇది ఒక భాగమని పేర్కొంది. ఇది స్వాగతించదగిన పరిణామం అని పేర్కొన్నారు. ఆ నీరు సురక్షితమైందని తేలిన తర్వాతనే దానిని సముద్రంలోకి విడుదల చేస్తామని ఆయన వివరించారు.