జపాన్, దక్షిణకొరియా దేశాల్లో ఒక్కసారిగా కరోనా వ్యాప్తి అధికమైంది. జపాన్లో రోజూవారీ కేసుల సంఖ్య 3వేలు దాటింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిబంధనలను సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అటు దక్షిణకొరియాలోనూ రోజూవారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దాదాపు 80 శాతం కొత్త కేసులు సియోల్ నగరంలోనే నమోదవుతున్నాయి. దీంతో సియోల్లో కఠిన ఆంక్షలు విధించారు అధికారులు.
శనివారం ఒక్కరోజే జపాన్లో 3,030 కరోనా కేసులు నమోదయ్యాయి. జపాన్లో మొత్తం కేసుల సంఖ్య 1,77,282గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 2,562 అని జపాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. దక్షిణకొరియాలో ఒక్కరోజులోనే 1,030 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,766కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 580గా ఉంది.