హగీబిస్ బీభత్సం నుంచి కోలుకునే యత్నాల్లో జపాన్ విరిగిపడ్డ కొండ చరియలు... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు... జలమయమైన జనావాసాలు...! హగీబిస్ తుపాను బీభత్సం అనంతరం జపాన్లోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. మధ్య, ఉత్తర జపాన్లో ప్రకృతి విలయానికి 43 మంది బలయ్యారు. అనేక మంది గల్లంతయ్యారు. మరెంతో మంది నిలువనీడ కోల్పోయారు. ముమ్మరంగా సహాయ చర్యలు...
శనివారం తుపాను విరుచుకుపడిన సమయంలో ప్రాణాలు అరచేతపట్టుకుని గడిపిన ప్రజలు... ఇప్పుడు సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు అయినవారి ఆచూకీ తెలియక శోకసంద్రంలో మునిగిపోయారు. వీరికి సాధ్యమైనంత సాయం అందించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.
దేశవ్యాప్తంగా సహాయ చర్యల కోసం సైన్యం, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపింది ప్రభుత్వం. జలమయమైన ప్రాంతాల్లో భవనాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నవారిని హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. కొన్నిచోట్ల చిన్నచిన్న పడవల ద్వారా సహాయక సిబ్బంది వరద బాధితులను చేరుకుంటున్నారు.
బాధితుల నరకయాతన...
తుపాను బీభత్సంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. టోక్యో, మియాగీ, ఇవాటే, ఫుకుషిమా, నీగాటాలో వేలాది ఇళ్లకు కరెంట్ నిలిచిపోయింది.
చలిపులి... అసలు సవాలు...
ఉత్తర జపాన్లో ఈవారం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు, సహాయ చర్యలు చేపట్టే సిబ్బందికి చలిని ఎదుర్కోవడం పెను సవాలుగా మారింది.
ఇదీ చూడండి:సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం- 12 మంది మృతి