డిన్నర్‌కు వెళ్లాలన్నా, వివాహానికి హాజరవ్వాలన్నా మనకు తోడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తాం. మరి కుటుంబసభ్యులు దూరమై ఏ తోడూనీడా లేని వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి సరదాలను వారు ఇంకెలా తీర్చుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది జపాన్‌కు చెందిన ఫ్యామిలీ రొమాన్స్ సంస్థ.
కుటుంబీకులు, మిత్రులకు దూరమై ఒంటరిగా ఉన్నామనుకుంటున్న వారికి బంధు మిత్రులను అద్దెకు అందిస్తోంది. అవసరమైతే మొత్తం కుటుంబాన్ని కూడా ఇస్తోంది. అయితే ఈ సదుపాయం పొందాలంటే మాత్రం ఒక్కొక్కరికీ రోజుకు 200 డాలర్లు(రూ.14వేలు) చెల్లించాలని చెబుతున్నారు ఆ సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి యూచి ఇషీ.
" ఇలాంటి అద్దె సర్వీసులు విదేశీయులకు వింతగా అనిపించొచ్చు. కానీ, జపాన్‌లో మా భావనలను పక్కనబెట్టి చుట్టూ ఉన్న స్థానికులకు ఏం కావాలో వాటికే అధిక ప్రాధాన్యమిస్తాం. మేం కల్పించే సేవలను వినియోగించినవారిని చూసి ఇతరులు కూడా మా సంస్థ వద్దకు వచ్చినప్పుడే మేము సంతృప్తి చెందుతాం."
- యూచీ ఇషీ, ఫ్యామిలీ రొమాన్స్ సీఈఓ
కుటుంబ సభ్యులను కోల్పోయిన జపాన్ వాసులు ఫ్యామిలీ రొమాన్స్ ద్వారా భార్యను, పిల్లలను అద్దెకు పొందుతున్నారు. తమకు శాశ్వతంగా దూరమైన ఆత్మీయుల మీద ప్రేమను వీరిపై చూపిస్తున్నారు.
"నేను నిజానికి ఈ ఇంట్లో నా భార్య, కుమార్తెతో కలిసి నివాసముండేవాడిని. కానీ, నా భార్య అనారోగ్యంతో మృతి చెందింది, నా పిల్లలు నన్ను వదిలేసి వెళ్లిపోయారు. అందుకే ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా... ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
నా భార్య అనారోగ్యం కారణంగా పదేళ్ల పాటు ఇంటికీ, ఆసుపత్రికీ తిరుగుతూ ఉండేవాళ్లం. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల నాకు విసుగొచ్చేది. అందుకే నా భార్యపై కోపగించుకున్నాను. ఎందుకు నువ్వు ఇలా అనారోగ్యం పాలవుతావ్? మిగతా వారందరి భార్యలూ సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఎందుకిలా ఉంటావ్? నేనెందుకు ఇంత భారం మోయాలని ఆవేశపడ్డాను. ఈ అంశంపై నా భార్య బతికి ఉన్న రోజుల్లో నేను తనకి క్షమాపణలు చెప్పలేదు. ఆ విషయం నన్ను ఎంతగానో బాధిస్తోంది. ఆ తర్వాత కొద్ది రోజులకే నా మాటలకు బరువెక్కిన హృదయంతో ఆమె మరణించింది. అందుకే అద్దెకు తెచ్చుకున్న భార్యపై ఆ ఆప్యాయతను ఇప్పుడు చూపిస్తున్నాను."
-కజుషిగే నిషిదా, కార్యాలయ ఉద్యోగి
2010లో మొదలు
ఫ్యామిలీ రొమాన్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ)... యూచి ఇషీకి 24 ఏళ్ల వయసున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఒంటిరిగా ఉన్న వారికి అద్దెకు కుటుంబసభ్యులనివ్వాలనేది వినూత్న ఆలోచన. 2010లో ఈ సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా తమ సంస్థ కార్యాలయాలను పెంచుకున్నారు.