సుదూర గ్రహశకలానికి సంబంధించిన నమూనాల భూమికి చేరుకున్నాయి. వీటిని తీసుకొట్టిన జపాన్ వ్యోమనౌక హయబుసా-2 జారవిడిచిన క్యాప్సూల్.. ఆస్ట్రేలియాలోని వూమెరాలో.. పెద్దగా జనవాసాలు లేని ప్రాంతంలో ఆదివారం ఉదయం ల్యాండ్ అయింది. ఈ మేరకు తమకు సంకేతాలు అందినట్లు జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిపై పరిశోధించడం ద్వారా సౌర కుటుంబం, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
పారాచూట్ సాయంతో..
భూమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా..క్యాప్సూల్‌ను హయబుసా-2 విడిచిపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించిన సమయంలో అగ్నిగోళంగా మారింది. నేల నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో పారాచూట్ విచ్చుకొని, వేగం తగ్గింది. అనంతరం సాఫీగా ఆస్ట్రేలియా గడ్డపై దిగింది. ఈ క్యాప్సూల్‌ను నిర్దిష్టంగా గుర్తించడానికి ఆ ప్రాంతంలో అనేక శాటిలైట్ యాంటెన్నాలు, రాడార్లను, జపాన్ ఏర్పాటు చేసింది. ఈ క్యాప్సూల్ వెడల్పు 40 సెంటీమీటర్లే. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల జపాన్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.