జపాన్లో కురుస్తోన్న భారీ వర్షాలతో వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరదల బీభత్సానికి ఇప్పటివరకు ఆ దేశంలో 58 మంది మృతిచెందారు. దక్షిణ జపాన్లో ప్రారంభమైన ఈ వర్షాలు.. ఈశాన్య దిశగా పయనిస్తూ జపాన్ ద్వీపంపై ప్రభావం చూపుతున్నాయి. నదుల్లో భారీస్థాయిల్లో బురదనీరు ప్రవహిస్తున్న కారణంగా.. అక్కడి ఇళ్లు, రోడ్లు పూర్తిగా జలమయ్యాయి.
వరదల బీభత్సానికి సుందరమైన పర్వత మార్గాలు నీట మునిగాయి. నాగానోలోని ప్రముఖ పర్యటక ప్రదేశాలైన కామికోచి, మాట్సుమోటోలలో ప్రధాన రోడ్లపై బురదనీరు పేరుకుపోయింది. ఫలితంగా ఆ మార్గాలను మూసివేయడం వల్ల.. వందలాది మంది స్థానికులు, సందర్శకులు అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 14 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా పదివేల సైనిక బలగాలు, పోలీసులు సహా రెస్క్యూ టీమ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.