పెరుగుతున్న ఆత్మహత్యలను నియంత్రించేందుకు జపాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 'మినిస్టర్ ఆఫ్ లోన్లీనెస్'ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు జపాన్ ప్రధానమంత్రి యోషిహిదె సుగా.
టెట్సుషి సకమోటోకు ఒంటరితనం శాఖ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు సుగా. ప్రభుత్వంలో ఆయన ఇప్పటికే పలు బాధ్యతల్లో ఉన్నారు. తగ్గుతున్న జననాల రేటును పెంచడం, రీజనల్ రీవిటలైజేషన్పై ప్రచారం నిర్వహించడం, ఒంటరితనం, సోషల్ ఐసోలేషన్ వంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు సకమోటో.
ఒంటరితనం...
జపాన్ ప్రజల్లో ఒంటరితనం, అందరికీ దూరంగా ఉండటం వంటివి అతి పెద్ద సమస్యలుగా మారాయి. వీటిని పరిష్కరించేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఓ రోబోను సృష్టించి... ఒంటరితనంతో బాధపడుతున్న వారికి తోడుగా.. వారి చెయ్యి పట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదు.
కరోనా సంక్షోభంలో..
సాధారణంగానే అత్మహత్యలు ఎక్కువగా ఉండే జపాన్‌లో కరోనా వైరస్ సృష్టించిన అలజడుల వల్ల పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. 11ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆత్మహత్యల్లో పెరుగుదల నమోదైంది.
2020లో అక్టోబర్ నాటికి.. కరోనాతో మరణించిన వారి కన్నా.. కేవలం ఆ ఒక్క నెలలో ఆత్మహత్యల వల్ల ప్రాణాలు బలితీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం పరిస్థితులకు అద్దం పడుతోంది. అక్టోబర్‌లో 2,153 మంది ఆత్మహత్య చేసుకోగా.. అప్పటివరకు వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 1,765 ఉండటం గమనార్హం. ఈ వివరాలను జపాన్ జాతీయ పోలీసు సంస్థ వెల్లడించింది.
గుండె సమస్యలు, డిమెన్షియా, ఎక్కువగా తినే అలవాటు వంటివి ఆత్మహత్యకు దారితీస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా మహిళల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. అక్టోబర్‌లో 879మంది మహిళాలు ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో నమోదైన వాటి కన్నా ఇది 70శాతం అధికం.
తొలిసారిగా..
మినిస్టర్ ఆఫ్ లోన్లీనెస్‌ను తొలిసారిగా 2018లో బ్రిటన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒంటరితనంలో కూరుకుపోతున్నట్టు.. దేశంలోని 90 లక్షల మంది భావిస్తున్నారన్న ఓ నివేదికతో ఈ చర్యలు చేపట్టింది. అయితే మూడేళ్లలో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు మారారు.
ఈ తరహా మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని ఆస్ట్రేలియా కూడా యోచిస్తోంది.
ఇదీ చూడండి:-జపాన్ 'ట్విట్టర్ కిల్లర్'కు మరణశిక్ష