అమెరికా సమక్షంలో శనివారం అఫ్గానిస్థాన్-తాలిబన్ల మధ్య జరిగిన చర్చల్లో భారత విదేశాంగ మంత్ర జైశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేలా శాంతి ప్రక్రియ ఉండాలన్నారు జైశంకర్. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, మైనార్టీలు, మహిళలు, అణగారినవర్గాల హక్కులను కాపాడేలా.. హింసకు తావులేకుండా శాంతిప్రక్రియ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆఫ్గాన్ భూభాగం నుంచి భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంతర్గత యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్గన్‌లో శాంతి, సుస్థిరత నెలకొనాలని ఆకాంక్షిస్తున్న భారత్... ఆ దేశ పునర్నిర్మాణానికి 2బిలియన్ డాలర్ల సాయం అందించింది.
'అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
ఈ చర్చల ద్వారా అందిన చారిత్రక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. దేశంలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు విస్తృత, సమగ్ర రాజకీయ పరమైన పరిష్కారాన్ని అఫ్గాన్ నేతలు కనుగొనాలని ఆశాభావం వ్యక్తం చేసింది పాకిస్థాన్. చర్చల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న పాక్ విదేశాంగమంత్రి మహమ్ముద్ ఖురేషి ఈ వ్యాఖ్యలు చేశారు. తమ నిర్ణయాలకు అన్ని వర్గాలు కట్టుబడి ఉంటాయని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
దశాబ్దాల వివాదానికి తెరదించే దిశగా అఫ్గానిస్థాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శనివారం చర్చలు జరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో ఖతార్ రాజధాని దోహాలో ఈ శాంతి చర్చలను నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించనున్నాయి.
ఇదీ చూడండి:-తాలిబన్ల ఘాతుకానికి 16 మంది సైనికులు బలి