చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని దేశాల్లో వైరస్ ఉద్ధృతి పెరిగి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటలీ, దక్షిణ కొరియా, మంగోలియా, కెనడాలో తీవ్రమైన రవాణా ఆంక్షలు విధించాయి ఆ దేశాల ప్రభుత్వాలు. ఆంక్షల కారణంగా ఆయా దేశాల్లో జన జీవనం స్తంభించిపోయింది.
అత్యవసరమైతే తప్ప..
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు ఇటలీ ప్రధాని గియుసేప్ కాంటే. ఆరోగ్య దేశంగా మారేందుకు సహకరించాలని ఆ దేశ పౌరులకు సూచించారు. అందరూ సమన్వయంతో సహకరించినప్పుడే ఇది సాధ్యపడుతుందని తెలిపారు. సోమవారం సాయంత్రం నాటికి మరో 1,807 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటలీలో ఇప్పటివరకు మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 9,172కి చేరుకుంది. మృతుల సంఖ్య 463కు పెరిగింది.
దక్షిణ కొరియాలో తగ్గుముఖం
కరోనా వైరస్ తీవ్ర ప్రభావిత దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. రానురానూ ఈ దేశంలో కేసుల సంఖ్య తగ్గుతోంది. సోమవారం ఒక్కరోజు 131 కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాలతో పోల్చితే ఇదే అత్యల్పం. తాజాగా మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 54కు చేరుకుంది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 7,513 కేసులు నమోదయ్యాయి.