తెలంగాణ

telangana

ETV Bharat / international

18 దేశాలకు పాకిన ఉగ్రముఠా ఐసిస్‌ - 18 దేశాలకు పాకిన ఐసిస్​

ప్రపంచంలోనే మోస్ట్​ వాంటెడ్ టెర్రరిస్ట్​గా గుర్తింపు పొందిన అబూ బకర్​ అల్​ బాగ్దాదీ... అమెరికా ఆపరేషన్​లో ఆదివారం మరణించాడు. ఐసిస్​ ఉగ్రవాద సంస్థకు అధినేతగా వ్యవహరిస్తూ తన హింసాత్మక చర్యలతో ఎన్నో దేశాలకు అశాంతిని మిగిల్చాడు. ఒకటి కాదు రెండు కాదు ఐసిస్ ఏకంగా 18 దేశాలకు ​ పాకింది.

18 దేశాలకు పాకిన ఐసిస్‌ స్థాపన ఎప్పటిది?

By

Published : Oct 29, 2019, 9:56 AM IST

ఉగ్రదాడులతో ప్రపంచ వ్యాప్తంగా రక్తపుటేరులు పారిస్తున్న సంస్థ ఐసిస్. ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపిస్తామంటూనే... ముస్లిం దేశాల్లో అత్యంత పాశవికంగా జనాన్ని హింసించడం, ప్రభుత్వాల మీద తిరుగుబాట్లు చేయడం, అమానవీయంగా జిహాదీ కార్యకలాపాలు సాగించడం దీని నైజం. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించే ఖలీఫాగా ప్రకటించుకున్న ఈ కరడుగట్టిన ఉగ్ర సంస్థ అధినేత అబూబకర్‌ అల్‌-బాగ్దాదీ ఆదివారం అమెరికా ఆపరేషన్‌లో మరణించడంతో ఈ సంస్థ పేరు మరోసారి ప్రముఖంగా వినిపిస్తోంది.

ఎలా పుట్టుకొచ్చింది?

ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌/ఐసిస్‌/ఐఎస్‌)- ఇవీ ప్రపంచానికి తెలిసిన పేర్లు. అరబీలో మాత్రం ‘దాయిష్‌’గా ప్రాచుర్యం పొందింది. ‘అల్‌-దావ్లా అల్‌-ఇస్లామియా అల్‌-ఇరాక్‌ అల్‌-షామ్‌’కు ఇది సంక్షిప్త పదం. సుదీర్ఘకాలంగా రూపాంతరం చెందుతూ ఐసిస్‌గా అవతరించిన ఈ సంస్థ వెనుక పెద్ద కథే ఉంది.

అది 2003...

ఇరాక్‌ సర్కారుకు వ్యతిరేకంగా ఆ దేశంలోని సున్నీవర్గం ముస్లింల తిరుగుబాటు తీవ్రస్థాయికి చేరిన రోజులవి. అల్‌-ఖైదా ఇన్‌ ఇరాక్‌ (ఏక్యూఐ) ఉగ్రవాద సంస్థ వారిని కూడగట్టింది. అబు మసబ్‌ అల్‌-జఖ్వావి నేతృత్వంలో ఈ సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను తీవ్రస్థాయిలో ఎగదోసింది. 2006లో జఖ్వావి మృతిచెందడంతో ఈ సంస్థకు నాయకత్వ సమస్య ఎదురైంది. స్థానికంగా ఉన్న చిన్నపాటి ఉగ్రవాద సంస్థలతో కలిసి 2007లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ (ఐఎస్‌ఐ)గా అవతరించింది. దేశాన్ని హస్తగతం చేసుకోవడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం సమాజాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని తహతహలాడింది. సున్నీలు అధికంగా ఉండే పశ్చిమప్రాంతం నుంచి కార్యకలాపాలను ఉద్ధృతం చేసింది. కానీ సున్నీలను అణచివేస్తూ, వారికి కంటి మీద కునుకు లేకుండా చేసింది! దీంతో వారు ఐఎస్‌ఐకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. మరోవైపు అమెరికా దళాలు, ఇరాక్‌ సేనలు ఐఎస్‌ఐకు వ్యతిరేకంగా దాడులుచేపట్టడంతో 2010 నాటికి ఆ సంస్థ పెద్ద నేతలను కోల్పోయింది. ఈ క్రమంలో విదేశీ సేనలు క్రమంగా వైదొలగడంతో 2011లో మళ్లీ ఐఎస్‌ఐ బలపడింది.

సిరియాలోనూ పాగా వేసిన ఐసిస్​

అదే సమయంలో సిరియాలో అంతర్యుద్ధం తీవ్రస్థాయికి చేరంది. అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ పాలనపై తిరుగుబాటుదారులు చెలరేగడాన్ని ఐఎస్‌ఐ తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇరాక్‌ నుంచి సరిహద్దుల గుండా తన ఉగ్రవాదులను సిరియాలోని తూర్పు ప్రాంతాలకు పంపింది. స్థానిక తిరుగుబాటుదారులతో కలిసి 2012 నాటికి అక్కడ బలమైన శక్తిగా అవతరించింది. అప్పటికే అబు బకర్‌ అల్‌-బాగ్దాది ఉగ్రవాదుల నాయకుడిగా ఎదిగాడు. అయ్‌మాన్‌ అల్‌-జవాహిరి నేతృత్వంలోని స్థానిక అల్‌-ఖైదా, నుస్రా ఫ్రంట్‌ తదితర సంస్థలతో ఐఎస్‌ఐను కలిపేస్తున్నట్టు 2013 ఏప్రిల్‌లో ప్రకటించాడు. దీన్ని ‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ ద లెవాంట్‌ (ఐఎస్‌ఐఎల్‌)’గా పేర్కొన్నాడు. కొద్దిరోజుల్లోనే ఇది ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌)- ఐసిస్‌గా గుర్తింపు పొందింది. తీవ్రంగా బలపడి ఇరాక్‌-సిరియా సరిద్దుల్లోని సుమారు 88,000 కిలోమీటర్ల పరిధిలో పాలన సాగించింది. పోలీసు, విద్య, ఆరోగ్యం, పన్నుల సేకరణ తదితర కార్యకలాపాలన్నీ తన కనుసన్నల్లోనే నిర్వహించింది. అక్కడ ఇస్లామిక్‌ చట్టాలను అత్యంత కఠినంగా అమలుచేసింది. చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఎంతోమందిని బహిరంగంగా ఉరితీసింది. అక్రమాలు, దోపిడీలతో శరవేగంగా విస్తరించేందుకు ప్రయత్నించింది. ఇరాక్‌, సిరియాల నుంచే కాకుండా ఇతరదేశాల్లో తీవ్రవాద భావాలున్నవారిని పెద్దఎత్తున నియమించుకుంది. ఉగ్రవాదంలో భాగంగా ఆడవారిపై అత్యాచారాలు సాగించేలా వారికి స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహించింది.

అంతర్జాతీయ సమాజానికి ముచ్చెమటలు

ఐసిస్‌ అరాచకాలు హద్దుమీరడంతో అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. కుర్దుల ప్రాంతంపై పట్టు సాధించకుండా ఐసిస్‌ ఉగ్రవాదులను నిలువరించేందుకు అమెరికా సేనలు ఇరాక్‌కు వచ్చి ప్రయత్నించాయి. మరోవైపు సిరియాలోని ఐసిస్‌ చేతికి చిక్కిన ప్రాంతాలపై జోర్డాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియాలతో కలిసి అమెరికా యుద్ధం సాగించింది. ఈ క్రమంలో ప్రపంచాన్ని భయపెట్టేందుకు ఐఎస్‌ఐఎల్‌ వికృత చేష్టలకు పాల్పడింది. విదేశీ పాత్రికేయులు, సహాయకులు, పైలట్లు, సైనికుల తలలు నరికి అందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. సంస్కృతిని మారుస్తామంటూ ఇరాక్‌, సిరియాల్లోని చర్చిలు, చారిత్రక కట్టడాల ధ్వంసానికి ఒడిగట్టింది. 2014 నాటికి అనుబంధ ఉగ్రవాద సంస్థలతో కలిసి ఆఫ్రికా, ఆసియా తూర్పు, మధ్య ప్రాంతాల్లోకి బలంగా చొచ్చుకెళ్లింది. నైజీరియాలోని బోకోహారం; అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌లతో కూటమికట్టింది. లిబియా, ఇథియోపియా, ఈజిప్ట్‌లోని కొన్ని ప్రాంతాలను హస్తగతం చేసుకుంది. మొత్తం 18 దేశాలకు ఉగ్ర కార్యకలాపాలను విస్తరించింది.

98% ప్రాంతాలకు విముక్తి

ఐరాస సహకారంతో 2016 నాటికి ఇరాక్‌లో కుర్దిష్‌లు బలపడుతూ వచ్చారు. ఐఎస్‌ఐఎల్‌కు పట్టున్న ప్రాంతాలను హస్తగతం చేసుకునేలా స్థానిక ప్రభుత్వాలు, సంస్థలకు అమెరికా సైనిక సాయం అందించింది. ఒకప్పుడు ఇరాక్‌, సిరియాల్లో ఐసిస్‌ గుప్పిట ఉన్న సుమారు 98% ప్రాంతాలకు విముక్తి లభించింది. అయితే ఇప్పటికీ 18,000 మంది వరకు ఐసిస్‌ ఉగ్రవాదులు ఆ రెండు దేశాల్లో ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా.

రక్త పిపాసి అల్‌ బాగ్దాదీ

ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కోరలు చాచిన ఐసిస్‌ ముఠా అధిపతి అల్‌ బాగ్దాదీ అసలు పేరు ఇబ్రహీం అవద్‌ అల్‌ సమర్రాయ్‌. ఇరాక్‌లోని బాగ్దాద్‌కు ఉత్తరాన ఉన్న సమర్రాలో 1971లో పుట్టాడు. అతడి కుటుంబ సభ్యుల్లో పలువురు సున్నీ ఇస్లాంలోని అత్యంత ఛాందసవాదంతో కూడుకున్న సలాఫీ ధర్మాన్ని బోధించేవారు.

2003లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాక్‌పై దాడి చేసేనాటికి అతడు బాగ్దాద్‌లోని ఒక మసీదులో మత బోధకుడిగా ఉండేవాడు. నాటి ఇరాక్‌ పాలకుడు సద్దాం హుస్సేన్‌ పాలన సాగిస్తున్నప్పుడే అతడు ఉగ్రవాదంలోకి మళ్లాడని కొందరు చెబుతున్నారు. 2003లో అల్‌ ఖైదా ముఠా నాయకులతోపాటు అతడిని దక్షిణ ఇరాక్‌లోని ‘క్యాంప్‌ బుకా’ అనే శిబిరంలో అమెరికా నిర్బంధించింది. ఆ సమయంలోనే అతడిలో ఛాందసవాద బీజాలు పడ్డాయని మరికొందరు చెబుతున్నారు. అతడితో పెద్దగా ముప్పు లేదన్న నిర్ధారణకు వచ్చిన అమెరికా బలగాలు ఏడాది తర్వాత అతడిని విడుదల చేశాయి. 2010లో అతడు ఇరాక్‌లో అల్‌ఖైదా నాయకుడయ్యాడు. అల్‌ఖైదాకు చెందిన సిరియా విభాగం నుస్రా ఫ్రంట్‌తో యుద్ధానికి దిగాడు. తద్వారా 2013లో అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్‌ జవహరితో విడిపోయాడు. ఐసిస్‌ను తెరపైకి తెచ్చాడు.

‘ఖలీఫా’ స్థాపన

2014లో బాగ్దాదీ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కాడు. నాడు శుక్రవార ప్రార్థనల రోజున మోసుల్‌ పట్టణంలోని మధ్యయుగం నాటి అల్‌ నురి మసీదుపైకి ఎక్కి, ‘ఖలీఫా రాజ్యాన్ని’ పునఃస్థాపిస్తున్నట్లు ప్రకటించాడు. ‘‘శత్రువులతో పోరాడాలని దేవుడు ఆదేశించాడు’’ అని చెప్పాడు. తనను తాను ఖలీఫ్‌ ఇబ్రహీంగా, విశ్వాసకుల సేనాధిపతిగా ప్రకటించుకున్నాడు.

దీంతో ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఇరాక్‌, సిరియాకు తరలి వచ్చారు. ‘జుంద్‌ అల్‌ ఖిలాఫా’ (ఖలీఫా సైనికులు)లో చేరారు. ఇరాక్‌లో షియా నేతృత్వంలోని ప్రభుత్వం, దానికి మద్దతుగా ఉన్న అమెరికా సంకీర్ణ బలగాలపై దాడులు నిర్వహించారు. అమెరికా, ఇరాక్‌, కుర్దు సేనలు వెంట పడటంతో అల్‌ బాగ్దాదీ ఆత్మరక్షణలో పడిపోయాడు. చావు భయంతో అతడు సాధారణ కారులు, పికప్‌ ట్రక్కుల్లో ప్రయాణించేవాడు. ఒక చోటు నుంచి మరోచోటుకు మకాం మార్చేవాడు. తన రక్షణ మంత్రి అల్‌ ఒబాయిదీ, తన భద్రతాధిపతి అయద్‌ అల్‌ జుమాలితో ఎక్కువగా సమాచారాన్ని పంచుకునేవాడు. జుమాలి ఇప్పటికే హతమయ్యాడు. ఒబాయిదీ ఆచూకీ ఇంకా తెలియదు. ఐసిస్‌కు అతడు వారసుడు కావొచ్చని భావిస్తున్నారు.

ఎవరీ ఖైలా ముల్లర్‌?

నరరూప రాక్షసుడు, ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) ముష్కరముఠా సారథి అబూబకర్‌ అల్‌ బాగ్దాదీని అంతమొందించేందుకు అమెరికా సైనిక చర్యకు పెట్టిన పేరు ‘ఖైలా ముల్లర్‌’. ఆ పేరు ఓ అమెరికన్‌ యువతిది. ఆమె సంస్మరణార్థమే ఈ పేరు పెట్టారు. ఖైలా ముల్లర్‌.. మానతవతా మూర్తి. మానవహక్కుల కార్యకర్త. సేవే పరమావధిగా పనిచేసిన ఆమెను ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠాలు బందీగా పట్టుకున్నాయి. చిత్రహింసలకు గురిచేసి చంపేశాయి. స్వయంగా బాగ్దాదీనే ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఐఎస్‌ నిర్బంధంలో మరణించేనాటికి ఆమె వయసు 26 ఏళ్లు.

అమెరికాలోని అరిజోనాకు చెందిన ఖైలాముల్లర్‌ నార్తరన్‌ అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పట్టా పొందారు. మొదట్నుంచీ కూడా సంఘసేవ పట్ల ఆమె ఎంతో ఆసక్తి చూపేవారు. 2012 నుంచీ టర్కీలో సేవలందించిన ఆమె 2013 ఆగస్టులో అక్కడి నుంచి సిరియాలోని అలెప్పో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఓ అంతర్జాతీయ సహాయ సంస్థ నిర్వహిస్తున్న స్థానిక ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లారు. సరిగ్గా అక్కడే ఖైలాముల్లర్‌ను ఇస్లామిక్‌ స్టేట్‌ ముష్కరులు బందీగా పట్టుకున్నారు. నాటి నుంచి ఆమె నానా చిత్రహింసలకు గురయ్యారు. బాగ్దాదీ మరణించిన తర్వాత ఖైలాముల్లర్‌ తండ్రి కార్ల్‌ ముల్లర్‌ మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె ధైర్యసాహసాలు, సేవానిరతి, భగవంతుడిపై భక్తివిశ్వాసాల గురించి చెప్పారు. 2014లో ఆమె నిర్బంధంలో ఉండగా రాసినట్లు చెబుతున్న ఓ లేఖ ప్రతిని ఆయన పత్రికల వారికిచూపారు. ఆ లేఖలోని ప్రతి అక్షరం ఖైలా ధైర్యసాహసాలకు అద్దం పడుతున్నాయన్నారు.

విభిన్న సందర్భాలు.. ఒకటే లక్ష్యం!

పాకిస్థాన్‌లో ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్‌ విషయమై మే 1, 2011న శ్వేతసౌధంలోని ‘సిచ్యుయేషన్‌ రూమ్‌’లో కూర్చుని పరిస్థితి సమీక్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు (అప్పటి) బరాక్‌ ఒబామా. చిత్రంలో అప్పటి విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ తదితరులు. ఇక రెండో చిత్రం ఐసిస్‌ అధినేత అబూబకర్‌ అల్‌ బాగ్దాదీ లక్ష్యంగా అమెరికా డెల్టాఫోర్స్‌ దళం ఆదివారం చేపట్టిన దాడుల పురోగతిని శ్వేతసౌధం నుంచి సమీక్షిస్తున్న అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తదితరులు. రెండు చిత్రాల్లో అధ్యక్షులు, పక్కన ఉన్నవాళ్ల హవభావాల్లో వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. అందరి లక్ష్యం ఒక్కటేనన్నది సుస్పష్టం. అదే ఉగ్రవాద నిర్మూలన.

ఇదీ చూడండి: నేడు సౌదీ అరేబియాకు వెళ్లనున్న ప్రధాని మోదీ.

ABOUT THE AUTHOR

...view details