తాలిబన్లు మారిపోయారా? మహిళా వ్యతిరేకులనే ముద్రను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే పాక్షికంగా అవునేమోనన్న సమాధానం వస్తోంది. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత వీరిలో కాస్త మార్పు కనిపిస్తోంది. ఇదివరకు తమకు ఉన్న ఇమేజ్ను తుడిచేసుకొని, ప్రజల్లో భయాలను తొలగించుకోవాలని యత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
దేశ ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటన చేసిన తాలిబన్ సాంస్కృతిక కమిషన్ సభ్యుడు ఎనాముల్లా సమంగానీ.. అదే సమయంలో మహిళల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సహజ వైఖరికి విరుద్ధంగా ప్రభుత్వ ఏర్పాటులో మహిళలు సైతం పాల్గొనాలని పిలుపునిచ్చారు. 'ఇస్లామిక్ ఎమిరేట్(అఫ్గానిస్థాన్).. మహిళలను బాధితులుగా చూడాలనుకోవడం లేదు. ఏ విధమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే అంశంపై స్పష్టత లేదు. గత అనుభవాలను బట్టి.. పూర్తిస్థాయి ఇస్లామిక్ నాయకత్వమే ఉండాలని అనుకుంటున్నాం. అన్ని వర్గాలు ఇందులో భాగస్వాములు కావాలి' అంటూ చెప్పుకొచ్చారు.
అఫ్గాన్‌ను ఆక్రమించుకునే సమయంలోనూ తాలిబన్లు తమ సహజ వైఖరికి విరుద్ధంగా ప్రవర్తించారు. ఎక్కడా విధ్వంసాలకు పాల్పడలేదు. ఎవరికీ హాని తలబెట్టబోమంటూ మరోసారి మంగళవారం భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించొద్దంటూ తాము ఫైటర్లను ఆదేశించామని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు జారీ చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మరోవైపు, అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పనిచేసినవారిపై తామేమీ ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ హామీ ఇచ్చారు. అఫ్గాన్ ప్రజల్లో అనవసరపు భయాందోళనలను రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. యథావిధిగా పనులకు వెళ్లాలని తాలిబన్లు టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అదే సమయంలో, ఓ మహిళా జర్నలిస్ట్‌కు తాలిబన్ ప్రతినిధి ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళలు పని చేయడాన్ని ఇష్టపడని తాలిబన్లు.. ఇలా ప్రత్యక్ష ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని కొత్తగా చూస్తున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు.
అప్పట్లో అలా..