ఇరాక్‌లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 92 మంది రోగులు చనిపోగా.. మరో 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్-హుస్సేన్ కొవిడ్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలో మంటలతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ప్రమాదానికి కారణమిదేనా?
ఆసుపత్రి ప్రాంగణంలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలడం వల్లే మంటలు వ్యాపించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు ఓ అధికారి తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. దీంతో కొవిడ్ వార్డుల్లో చిక్కుకున్న రోగులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
ప్రధాని అత్యవసర భేటీ
ఘటనపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-ఖాదిమి రాష్ట్ర వైద్య డైరెక్టర్‌ను సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రి డైరెక్టర్, నగర రక్షణ సివిల్ డైరెక్టర్‌ను కూడా సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
ఈ ఆసుపత్రిలో మూడు నెలలు క్రితమే కొత్తవార్డును తెరిచి.. 70 పడకలను ఏర్పాటు చేశారు.
గత ఏప్రిల్‌లో కూడా ఓ కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది రోగులు చనిపోగా, 110 మంది గాయపడ్డారు. ఇరాక్ ఇప్పటివరకు 14 లక్షల కొవిడ్ కేసులు నమోదు కాగా, 17,000పైగా చనిపోయారు.