ఇరాన్ విమాన ప్రమాదంలో 176 మంది దుర్మరణం ఇరాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 176 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు.
ఉక్రెయిన్‌కు చెందిన 737-800 విమానం ఇరాన్‌లోని ఖొమేని విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే కూలిపోయింది. సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
"ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఉక్రెయిన్ విమానం.. పరాంద్, షహర్యార్‌ల మధ్య కుప్పకూలింది. ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాన్ని పంపించాం." - రెజా జాఫర్జే, ఇరాన్ పౌరవిమానయాన సంస్థ అధికార ప్రతినిధి
మృతుల కోసం
విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇరాన్ అత్యవసర విభాగం అధికారి పిర్ హుస్సేన్ కులివాంద్ తెలిపారు.
ప్రయాణికుల సంఖ్య?
ఇరాన్ ప్రభుత్వం 167 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది మరణించారని ప్రకటించింది. అయితే అధికారిక టీవీ ఛానెల్ మాత్రం అంతకు ముందు 180 మంది ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటన తరువాత కూడా ఈ సంఖ్యను వెంటనే మార్చకపోవడం గమనార్హం.
ఫ్లైట్ డేటా ఏం చెబుతోంది?
ఉక్రెయిన్‌కు చెందిన 737-800 విమానం ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం బయలుదేరింది. ఆపై వెంటనే డేటాను పంపడం ఆగిపోయిందని ఫ్లైట్ రాడార్ 24 అనే వెబ్సైట్ పేర్కొంది. అయితే దీనిపై విమానయాన సంస్థ స్పందించలేదు.
గంటల వ్యవధిలో..!
తమ అత్యున్నత సైనిక జనరల్ సులేమానిని అమెరికా హతమార్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకారంగా దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రయాణికుల విమానం ప్రమాదానికి గురికావడం గమనార్హం.
ఇదీ చూడండి:దేశవ్యాప్త బంద్: బంగాల్లో నిరసనలు ఉద్ధృతం