తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా-ఇరాన్​ 'శాంతి మంత్రం' ఎంత కాలమో? - అమెరికా

యుద్ధం అంచు వరకు వెళ్లిన అమెరికా-ఇరాన్ అనూహ్యంగా శాంతి బాటపట్టాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరుదేశాలు రగిలిపోవడం వల్ల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. ఇందుకు ఇరాన్​ తెలివిగా వ్యవహరించి దౌత్యపరంగా తీసుకున్న నిర్ణయాలే కారణం. మరి ఈ చర్యలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. దీర్ఘకాలంలో పరిస్థితి మారిపోతుందా?

Iran USA standoff: Deft diplomatic footwork, quickly averts major crisis
అమెరికా-ఇరాన్​ 'శాంతిమంత్రం' ఎంతకాలమో?

By

Published : Jan 13, 2020, 7:18 AM IST

ఒకానొక సందర్భంలో కయ్యానికి కాలుదువ్విన అమెరికా-ఇరాన్​ దేశాలు.. చివరికి శాంతించాయి. ఫలితంగా పశ్చిమాసియాను కమ్మేసిన యుద్ధమేఘాలు ఎట్టకేలకు తొలిగిపోయాయి. ఇరుదేశాలు యుద్ధానికే మొగ్గు చూపితే.. తీవ్ర సంక్షోభం తప్పదనుకున్న ప్రపంచదేశాలు ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను గండం తప్పింది. చమురు సరఫరా గాడిన పడింది. ఇరాన్ తెలివిగా వ్యవహరించి​ దౌత్యపరంగా అడుగులు వేయడం.. వాటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నుంచి సానుకూల స్పందన రావడమే ఇందుకు ముఖ్య కారణం.

ట్రంప్ ప్రకటనతో

ఈ నెల 8వ తేదీన ట్రంప్​ చేసిన ప్రసంగంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్​లోని అగ్రనేతలు, ప్రజలతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు ప్రకటించడం వల్ల చమురు ధరలు తగ్గాయి. స్టాక్​ మార్కెట్లు కూడా అనూహ్యంగా పుంజుకున్నాయి.

తాత్కాలికమే..!

అయితే ఈ పరిణామాలు తాత్కాలికంగా మిగిలిపోయే అవకాశాలున్నాయి. ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై డజనుకు పైగా క్షిపణులతో దాడి చేసిన ఇరాన్​.. తమ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది.

ఇరాన్​ సైన్యాధిపతి జనరల్​​ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చడం వల్ల పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

1979లో ఇరాన్​లో ఇస్లాం పాలన మొదలైంది. ఇరాన్ చివరి​ షా మొహమ్మద్​ రెజా పహ్లావీ నుంచి అయతుల్లోహ్​ రుహొల్లాహ్​ ఖొమైనీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే అదే సంవత్సరంలో తిరుగుబాటు విద్యార్థులు​ టెహ్రాన్​లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. దౌత్యవేత్తలు, సిబ్బందితో సహా మొత్తం 52 మందిని 444 రోజుల పాటు నిర్బంధించారు. అప్పటి నుంచి అమెరికా-ఇరాన్​ సంబంధాల రూపురేఖలు మారిపోయాయి.

అటు మైత్రి.. ఇటు శత్రుత్వం

అప్పటి నుంచి ఇస్లాం పరిపాలనను అణగతొక్కేందుకు అగ్రరాజ్యం విశ్వప్రయత్నాలు చేస్తోంది. 1980-88 మధ్య కాలంలో ఇరాన్​తో జరిగిన యుద్ధంలో సద్దామ్​ హుస్సేన్​కు నిధులు, ఆయుధాలు సమకూర్చిన అమెరికా.. ఇరాక్​కు తన వంతు సహకారాన్ని అందించింది. ఇరాన్​ శత్రు దేశమైన సౌదీ అరేబియాతో అమెరికాకు మంచి సంబంధాలున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్​తోనూ ఇరాన్​ మైత్రి బలహీనపడటం వల్ల అమెరికా-ఇరాన్​ సంబంధాలు మరింత క్షీణించాయి.

శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన ఇరాన్​.. తన అణు వ్యవస్థను బలపరచుకునేందుకు రహస్యంగా అడుగులు వేసింది. యురేనియంలో సంపన్న దేశంగా పిలిచే ఇరాన్​కు.. దాన్ని వెలికితీసేందుకు అవసరమైన పరిజ్ఞానంతో పాటు పరికరాలు సమకూర్చింది పాకిస్థాన్. కానీ ఇరాన్​ చర్యలను అమెరికా దెబ్బ కొట్టింది. ఐక్యరాజ్య సమితితో కలిసి టెహ్రాన్​పై ఆంక్షల వర్షం కురిపించింది.

అణు ఒప్పందంతో శాంతి!

అయితే 2015లో పరిస్థితులు కొంతమేర మెరుగుపడ్డాయి. అణు వ్యవస్థ పరంగా జేసీపీఓఏ(జాయింట్​ కాంప్రహెన్సివ్​ ప్లాన్​ ఆఫ్​ ఆక్షన్​)లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యులతో ఇరాన్​ ఒప్పందం కుదుర్చుకుంది. కొద్దిపాటి యురేనియం నిల్వలను తొలిగించడం, తక్కువ నాణ్యత గల యురేనియంపై 15ఏళ్ల పాటు ఆంక్షలు విధించడం ఇందులో భాగం.

ఈ ఒప్పందానికి ప్రపంచ దేశాలు మద్దతు పలికాయి. కానీ డొనాల్డ్​ ట్రంప్​ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా చరిత్రలోనే ఈ ఒప్పందం ఒక తప్పిదంగా పేర్కొన్నారు. తాను అధ్యక్ష పదవి చేపడితే ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తానని ప్రచారాలు చేశారు. చెప్పినట్టు గానే జేసీపీఓఏలో జరిగిన ఒప్పందాన్ని 2018 మేలో రద్దు చేశారు ట్రంప్. అదే సమయంలో ఇజ్రాయెల్​- అమెరికా కలిసి ఇరాన్​ అణు కేంద్రాలపై దాడి చేయడానికి సన్నద్ధమవుతున్నాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇరాన్​పై ఆంక్షలను ట్రంప్​ తిరిగి విధించారు. టెహ్రాన్​ నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ప్రపంచ దేశాలను డిమాండ్​ చేశారు.

భారత్​ పరిస్థితి...

ఇరాన్​తో భారత్​కు మంచి సంబంధాలున్నాయి. దాదాపు 80 లక్షల మంది భారతీయులు పశ్చిమాసియాలో నివసిస్తున్నారు. వీరి నుంచి భారత్​కు ఏటా దాదాపు 40 బిలియన్​ డాలర్లు అందుతాయి. దీనితో పాటు ఇంధన​ అవసరాల కోసం ఇరాన్​పై భారత్​ ఆధారపడుతోంది. అటు అగ్రరాజ్యంతోనూ భారత్​కు ఎలాంటి ఇబ్బందులు లేవు. అమెరికా- భారత్​ చెలిమి ప్రపంచదేశాలకు స్పష్టంగా తెలుసు. అందువల్ల ఇరాన్​-అమెరికా ఉద్రిక్తతల్లో భారత్​ ఏ పక్షానా నిలబడలేదు. పైగా భారత్​ మధ్యవర్తిత్వం వహించడానికి ఎప్పుడూ ఇష్టపడదు.

ఇరాన్​ ప్రతీకారం...

అమెరికా విధించిన ఆంక్షలను ఇరాన్​ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ తమ దేశంపై ఆంక్షలు విధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాక్​, సిరియా, లెబనాన్​ దేశాల్లో అమెరికా దళాలు, స్థావరాలే లక్ష్యంగా జరిగిన దాడులకు సహకరించింది. డిసెంబర్​ 27న కిర్​కుక్​లో జరిగిన రాకెట్​ దాడి ఈ చర్యల్లో ఒకటి. ఇందులో అమెరికా మిలిటరీకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ పరిణామాలు.. జనరల్​ సులేమానీ మరణానికి దారి తీశాయి.

సులేమానీ మరణం అనంతరం ప్రతీకారేచ్ఛతో రగలిపోయిన ఇరాన్​.. ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై డజనుకుపైగా క్షిపణులతో దాడి చేసింది. అగ్రరాజ్యానికి భారీ నష్టం వాటిల్లిందని ప్రకటించింది. ఇది జరిగిన కొద్ది గంటలకే... ఇరాన్​ ప్రతిఘటనతో తమకు ఎలాంటి నష్టం జరగలేదని అధ్యక్షుడు ట్రంప్​ పేర్కొన్నారు. దాడిలో తమ సైనికులెవరూ ప్రాణాలు కోల్పోలేదని స్పష్టం చేశారు.

తెలివైన ఎత్తుగడతో చెక్​...!

ప్రపంచదేశాల ముందు తమ గౌరవాన్ని పెంచుకునేందుకే ఇరాన్​ దాడులకు పాల్పడినట్టు స్పష్టమైంది. ఇక్కడే ఇరాన్​ తెలివిని ప్రదర్శించింది. ఇరాక్​, స్విట్జర్లాండ్​ ద్వారా అమెరికాతో తెర వెనుక సంప్రదింపులు జరిపింది. ఇది దౌత్యపరంగా ఎంతో తెలివైన ఎత్తుగడ. భారీ దాడులు చేయడానికి శ్వేతసౌధం ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో ఇది ఇరాన్​కు ఎంతో ఉపయోగపడింది. ఫలితంగా శాంతియుత వాతావరణం నెలకొంది.

ఉద్రిక్తతలు ఎంత తగ్గినా.. తమ మధ్య ఎన్నో దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వాన్ని అమెరికా-ఇరాన్​ దేశాలు మర్చిపోతాయి అనుకోవడం సరికాదు. పశ్చిమాసియాలో క్షమాగుణం అనేది ఓ బలహీనతగా భావిస్తారు. అందువల్ల ఇరాన్​ చర్యలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ... దీర్ఘకాలంలో తీవ్ర నష్టాలను కలిగించే అవకాశముంది.

(రచయిత- విష్ణు ప్రకాశ్​, మాజీ రాయబారి)

ABOUT THE AUTHOR

...view details