ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న మొసిన్ ఫక్రజాదే శుక్రవారం హత్యకు గురయ్యారు. టెహ్రాన్ శివారులోని అబ్సాద్ గ్రామంలో ఈయన కారుపై దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడిన మొసిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఇరాన్ పేర్కొంది.
శాస్త్రవేత్త మొసిన్ ఫక్రజాదే మృతిపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జారిఫ్...ఈ హత్యలో ఇజ్రాయెల్ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కానీ, దానిపై పూర్తి వివరణ ఇవ్వలేదు.
దశాబ్దం క్రితం అనేక మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలను హత్య చేశారని ఇజ్రాయెల్‌పై ఆరోపణలు ఉన్న మాట నిజమే అయినా ...ఈ హత్యపై ఇజ్రాయెల్ స్పందించలేదు.