తెలంగాణ

telangana

ETV Bharat / international

'సుప్రీం' ఆదేశాలతో జర్నలిస్టును ఉరితీసిన ఇరాన్​ - ఇరాన్​ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు

ఇరాన్​ ప్రభుత్వం ఓ జర్నలిస్టును ఉరితీసింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇరాన్​ సుప్రీం కోర్టు గతంలో అతడికి మరణ శిక్ష విధించింది. దీంతో ఈ శిక్షను అధికారులు శనివారం అమలు చేశారు.

journalist
జర్నలిస్టును ఉరితీసిన ఇరాన్​

By

Published : Dec 12, 2020, 5:11 PM IST

ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఓ జర్నలిస్టును ఇరాన్‌ ప్రభుత్వం ఉరితీసింది. ప్రముఖ సామాజిక కార్యకర్త, అమద్‌ న్యూస్‌ వ్యవస్థాపకుడు రుహొల్లా జామ్‌కు అక్కడి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించగా.. శనివారం ఉదయం శిక్ష అమలు చేశారు.

2017-18లో ధరల పెరుగుదలపై ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నిరసనల్లో రుహొల్లా కీలక పాత్ర పోషించడమేగాక, తన న్యూస్‌ ఛానల్‌లో ఆందోళనలను ప్రత్యేకంగా కవర్‌ చేశారు. దీంతో అతడిపై ఇరాన్‌ చట్టంలోనే అత్యంత తీవ్ర నేరమైన అవినీతి కేసు నమోదైంది. అంతేగాక, పలు దేశాల నిఘా సంస్థలు జామ్‌కు రక్షణ కల్పిస్తున్నాయని ఇరాన్‌ ఆరోపించింది. దేశ భద్రతను పణంగా పెట్టి ఫ్రాన్స్‌, మరికొన్ని దేశాలకు గూఢచర్యం చేస్తున్నాడని అతడిపై కేసులు నమోదుచేసింది.

అయితే 2009 ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల తర్వాత ఫ్రాన్స్‌కు పారిపోయిన అతను.. అక్కడే అమద్‌ న్యూస్‌ను ఛానల్‌ను స్థాపించారు. టెలిగ్రామ్‌ యాప్‌ వేదికగా ఈ ఛానల్‌ను నిర్వహించారు. కాగా.. ఫ్రాన్స్‌లో ఉన్న అతనిని అత్యంత చాకచక్యంగా ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ స్వదేశానికి రప్పించాయి. గతేడాది అక్టోబరులో రుహొల్లాను అరెస్టు చేసినట్లు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్‌లో అతడికి మరణశిక్ష విధిస్తూ ఇరాన్‌ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో శనివారం శిక్ష అమలు చేస్తూ జామ్‌ను ఉరితీశారు.

ఇదీ చూడండి:'కరోనా పేరుతో ఉత్తర కొరియా మానవ హక్కుల ఉల్లంఘన'

ABOUT THE AUTHOR

...view details