అమెరికా ఆంక్షలతో ఇన్నేళ్లు ఉక్కిరిబిక్కరి అయిన ఇరాన్‌కు తాజాగా కరోనా సెగ తగలింది. ఈ మహమ్మారిపై యుద్ధం ప్రకటించింది ఇరాన్. కానీ సరిపడా నిధులు లేక విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సంస్థను ఆశ్రయించింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు అత్యవసరంగా 5 బిలియన్ డాలర్ల అప్పు కావాలని కోరింది. ఇలా అప్పు కోరడం.. ఇరాన్‌కు 1962 తర్వాత ఇదే తొలిసారి.
5 బిలియన్ డాలర్ల అప్పు కోరుతూ ఇరాన్ కేంద్ర బ్యాంకు చీఫ్ అబ్దోల్ నాస్సర్.. ఐఎమ్ఎఫ్ అధిపతి క్రిస్టలీనాకు గత వారం లేఖ రాశారు. రాపిడ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కరోనా బాధిత దేశాలను ఆదుకుంటామని ఇది వరకే ప్రకటించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ.
వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వైద్య వసతులు ఏర్పాటు చేయాల్సివస్తోంది. మాస్క్‌లు, శానిటైజర్లు, ఐసోలేషన్ వార్డులు, కరోనా పరీక్షా కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తోంది ఇరాన్ ప్రభుత్వం. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.