తెలంగాణ

telangana

ETV Bharat / international

గుర్రపు స్వారీ మొదలైంది అక్కడి నుంచే! - equus caballus facts

గుర్రాలు మానవులు మధ్య స్నేహం ఎప్పుడు మొదలైంది? ఈ ప్రశ్నపై 162మంది శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం పరిశోధన చేపట్టింది. ఎట్టకేలకు సమాధానాన్ని కనుగొంది. అదేంటంటే..

intresting-facts-on-horse-and-human-relation
గుర్రపు స్వారీ మొదలైంది అక్కడి నుంచే!

By

Published : Oct 24, 2021, 8:29 AM IST

Updated : Oct 24, 2021, 9:11 AM IST

గుర్రంపై ఠీవిగా స్వారీ ఎవరికి ఆసక్తి ఉండదు? మేలు జాతి అశ్వాలపై కూర్చొని.. వాటిని వేగంగా దౌడు తీయిస్తుంటే ఆ రాజసమే వేరు. శతాబ్దాల పాటు మానవాళికి రవాణా సాధనాలుగా అశ్వాలు సేవలు అందించాయి. ఎందరో రాజులు, చక్రవర్తులు వీటిని అధిరోహించి కదనరంగంలో కౌశలాన్ని ప్రదర్శించారు. అశ్వాలు మానవులకు ఎప్పుడు మచ్చిక అయ్యాయన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై 162 మంది శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం పరిశోధన సాగించింది. మనిషికి నేస్తంగా మారిన ఆధునిక గుర్రం మూలాలు రష్యాలో ఉన్నాయని తేల్చింది.

ఆధునిక గుర్రం పేరు ఈక్వస్‌ క్యాబలస్‌. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం.. దీని పుట్టుపూర్వోత్తరాలను ఆవిష్కరించింది. ఇందుకోసం వారు ఐరోపా, ఆసియాలోని అనేక ప్రాంతాల్లో వెలుగుచూసిన పురాతన గుర్రాల శిలాజాలకు సంబంధించిన 273 జన్యుక్రమాలను పునర్‌నిర్మించారు. వాటిపై సమగ్ర విశ్లేషణ చేశారు. మొత్తమ్మీద ఆధునిక గుర్రం మూలాలు పశ్చిమ ఐరోపాలోని గడ్డినేలల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ వోల్గా, డాన్‌ నదుల సంగమం ఉందన్నారు. 4,200 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలోనే గుర్రాలు మనుషులతో చెలిమి చేయడం మొదలైందని చెప్పారు. అక్కడి నుంచే అవి ప్రపంచం మొత్తానికీ విస్తరించాయన్నారు.

చరిత్రాత్మక పరిణామక్రమం

5వేల నుంచి 4వేల సంవత్సరాల కిందట ఐరోపా, ఆసియాలో కాంస్య యుగం సాగింది. నాడు లేఖన సాధనాలు, కుండల తయారీ, చట్టాలు, నగరం-రాష్ట్రాలు, యుద్ధాలు, వ్యవసాయం వంటివి మానవ సమాజంలో వేళ్లూనుకున్నాయి. ఆ యుగానికి సంబంధించిన మానవ జన్యువులను విశ్లేషించినప్పుడు.. పశ్చిమ యూరేషియాలోని గడ్డి నేలల నుంచి మధ్య, తూర్పు ఐరోపాలోని ప్రాంతాలకు జనాలు భారీగా విస్తరించినట్లు తేలింది. అదే సమయంలో యూరేషియా వ్యాప్తంగా గుర్రాలు విస్తరించినట్లు చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలోనే.. ఉత్తర అమెరికాలోని గడ్డి నేలల్లో సంచరించిన ఆధునిక అశ్వాల పూర్వీకులు ఆసియాకు వలస వచ్చాయి. పూర్తిగా ఘనీభవించిన 'బెరింగ్‌ నేల వంతెన' వీటి ప్రయాణానికి ఉపయోగపడింది. ఈ అంశంపై లోతుగా పరిశోధించిన శాస్త్రవేత్తలు.. వోల్గా, డాన్‌ నదుల సంగమ ప్రాంతంలో నివసించిన ప్రజలు గుర్రాలను మచ్చిక చేసుకున్నారని పేర్కొన్నారు. నిజానికి అదే సమయంలో పలు ఇతర గుర్రాల జాతులనూ కొన్నిచోట్ల మాలిమి చేయడం మొదలుపెట్టారు. అయితే రష్యా ప్రాంతం నుంచి వచ్చిన అశ్వాలు.. క్రమంగా వాటి స్థానాన్ని ఆక్రమించేశాయి. వీటిని డీఓఎం2 గుర్రాలుగా పిలుస్తున్నారు. గుర్రపు స్వారీ సంస్కృతి, రథాల వాడకంతో పాటు ఇవి కూడా విస్తరించాయి.

కలిసొచ్చిన జన్యువులు..

క్రీస్తు పూర్వం కమ్మెలతో కూడిన చక్రాలు కలిగిన రథాలతో గుర్రాల ఎముకలు కనిపించాయి. అవి డీఓఎం2 గుర్రాలకు సంబంధించినవేనని శాస్త్రవేత్తలు తేల్చారు. రథాలు వ్యాప్తిలోకి రావడానికి ముందు గుర్రాలపై మానవుల స్వారీ సాగిందని గుర్తించారు. డీఓఎం2 అశ్వాల్లో జన్యుపరమైన అనుకూలతలూ లాభించాయి. వీటిలోని జీఎస్‌డీఎంసీ జన్యువు వల్ల బలమైన వెన్నుపూస, నడక సాధ్యమైంది. జెడ్‌ఎఫ్‌పీఎం1 అనే మరో జన్యువు వల్ల ఆ జీవులు భావోద్వేగాలు, దురుసు స్వభావాన్ని నియంత్రించుకోగలిగాయని పేర్కొన్నారు. ఫలితంగా ఆధునిక గుర్రాలు.. రథాలను లాగడానికి, మానవుల స్వారీకి, మచ్చిక కావడానికి వ్యవహారశైలిపరంగా అవసరమైన సర్దుబాట్లు చేసుకోవడానికి వీలు కలిగిందని తేల్చారు.

ఇదీ చూడండి:-పాక్​ సీరియళ్లలో ఇక ఆ సీన్లు కట్​

Last Updated : Oct 24, 2021, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details