ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్(Internet outage) కొద్ది సమయం పాటు నిలిచిపోయింది. ఫలితంగా పలు ఆర్థిక సంస్థల వెబ్సైట్లు, యాప్‌లు ఆగిపోయాయి. ఎయిర్లైన్లు, ఇతర కంపెనీలపైనా ఈ ప్రభావం కనిపించింది. ఇంటర్నెట్ మానిటరింగ్ వెబ్సైట్లు అయిన థౌజండ్ఐస్, డౌన్‌డిటెక్టర్ వంటి మాధ్యమాలు పలుమార్లు నిలిచిపోయాయి.
తమ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్టు హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా వెల్లడించింది. 17 నిమిషాల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని తెలిపింది.
ఆస్ట్రేలియాలో బ్యాంకింగ్, విమాన బుకింగ్, పోస్టల్ సేవల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. 'బాహ్య అంతరాయాల' వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆ దేశ తపాలా సేవల సంస్థ ఆస్ట్రేలియా పోస్ట్ పేర్కొంది. అనంతరం సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. సమస్యను పరిశీలిస్తున్నట్లు వివరించింది.
రిజర్వ్ బ్యాంక్ సైతం..
వీటితో పాటు అనేక ఇతర సేవలు గంట పాటు నిలిచిపోయి.. మళ్లీ ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా సహా కామన్వెల్త్, ఏఎన్‌జడ్, సెయింట్ జార్జ్, వెస్ట్‌పాక్ వంటి బ్యాంకింగ్ సంస్థలన్నీ ఈ అంతరానికి లోనయ్యాయి. ప్రస్తుతం ఈ సంస్థల వెబ్సైట్లన్నీ దాదాపుగా సాధారణ స్థితికి చేరుకున్నాయి.