ఇండోనేసియాలో శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్ ఆధారంగా వాటిని త్వరలోనే వెలికితీస్తామని అక్కడి అధికారులు చెప్పారు. జకార్తాలో బయల్దేరిన సదకె ఎస్‌జే 182 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఆచూకీ లేకుండా పోయింది. అనంతరం ఆదివారం ఉదయం లాంకాంగ్, లకీ ద్వీపాల మధ్య ఈ విమాన శకలాలు, మనుషుల శరీర భాగాలు, దుస్తులు తదితర వస్తులు లభ్యమయ్యాయి. ఈ ఆధారాలతో ఆ విమానం కూలిపోయిందని ప్రాథమికంగా భావిస్తున్నారు అధికారులు.
బయల్దేరిన కాసేపటికే..
శ్రీవిజయ ఎయిర్‌కు చెందిన ఈ జెట్ విమానంలో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు శిశువులు, సిబ్బందితో సహా.. మొత్తం 62 మంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:36 నిమిషాలకు టేకాఫ్ అయిన ఈ విమానం.. ఉన్నట్టుండి కిందకు పడిపోవటం మొదలై.. 21 సెకన్ల తర్వాత గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. అయితే.. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదు. సదరు విమానాన్ని నడుపుతున్న పైలట్లు.. పదేళ్లకుపైగా అనుభవమున్నవారని అధికారులు తెలిపారు. బ్లాక్‌బాక్సులను వెలికితీసి, పరిశీలన చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు లభ్యమవుతాయని సైన్యాధ్యక్షుడు హదీ జజాంటో అన్నారు.