తెలంగాణ

telangana

ETV Bharat / international

పాలూ నగరాన్ని వెంటాడుతున్న పీడకల - palu

ఇండోనేసియాలోని పాలూ నగరాన్ని సునామీ ధ్వంసం చేసి ఆరు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ ఆ పీడకల స్థానికులను వెంటాడుతూనే ఉంది. సాయం అందక వేలాది మంది ఇంకా దుర్భర జీవనం సాగిస్తున్నారు.

పాలూ నగరాన్ని వెంటాడుతున్న పీడకల

By

Published : Apr 15, 2019, 4:34 PM IST

పాలూ నగరాన్ని వెంటాడుతున్న పీడకల

ఇండోనేసియాలోని పాలూ నగరం సునామీ ధాటికి ధ్వంసమై ఆరు నెలలు గడిచింది. ఆ విపత్తు తాలూకా నీలినీడలు ఇంకా స్థానిక ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి.
గతేడాది సెప్టెంబర్ 28న భూకంపం ధాటికి సులవేసి ద్వీపం అతలాకుతలమైంది. వెంటనే వచ్చిన సునామీ... తీర ప్రాంతం మొత్తాన్ని ముంచెత్తింది. 4,400 మంది దుర్మరణం పాలయ్యారు. అధికారికంగానే లక్షా 73 వేల మంది నిరాశ్రయులయ్యారు. 20 వేల మంది ఇప్పటికీ గుడారాల్లోనే తలదాచుకుంటున్నారు.

ఈ వారంలో ఎన్నికలకు వెళ్తున్న అధ్యక్షుడు జోకో విడోడో సర్కారు... బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని గతంలో హామీ ఇచ్చింది.

"సాయం చేస్తామని ప్రకటించినప్పుడు మేమెంతో ఆనందించాం. ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు."
-ఆదే జహ్రా, బాధితురాలు

నూతన పక్కా ఇళ్ల నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. గుడారాల వద్ద ప్రభుత్వం విద్యుత్, నీళ్ల సౌకర్యం కల్పించలేకపోయింది. ఇలాంటి సంక్లిష్టతల మధ్య మండు వేసవిలో జీవనం సాగించడం దుర్భరమైంది.

స్వచ్ఛంద సంస్థలు నిధులు లేక ఆహార సరఫరా నిలిపివేశాయి.

"కనీస అవసరమైన ఆహారం అందించేందుకూ మా వద్ద నిధులు లేవు. ప్రభుత్వం ప్రకటించిన నిధులు విడుదల చేయలేదు."
- హిదాయత్, పాలూ నగర మేయర్

కొందరు బాధితులు ధ్వంసమైన ఇళ్లలో, మిగిలిన గదుల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకుని బతుకు వెళ్లదీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details