ఇరాన్‌తో భారత్ సంబంధాలకు ఇటీవల ఎదురుదెబ్బ తగిలింది. ఫర్జాద్-బి సహజవాయువు క్షేత్రం అభివృద్ధి కాంట్రాక్టును- దాన్ని కనుగొన్న 'ఓఎన్‌జీసీ విదేశీ' సంస్థకు కాకుండా, తమ దేశంలోని పెట్రోపార్స్ సంస్థకు ఇరాన్ అప్పగించింది. ఓఎన్‌జీసీ విదేశాంగ విభాగమైన ఓఎన్‌జీసీ విదేశ్, ఈ క్షేత్రాన్ని ఫార్సీ తీరం వద్ద 2008లో గుర్తించింది. ఇక్కడ 23 లక్షల కోట్ల ఘనపుటడుగుల సహజవాయువు నిల్వలు ఉన్నాయి. భారత్ వ్యాపార సంస్థల బృందం ఇప్పటికే ఇక్కడ 40 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టింది. ఇదంతా ఆ క్షేత్రానికి చెందిన కాంట్రాక్టు కోసమే! కానీ ఇప్పుడది దక్కలేదు. పైప్‌లైన్ల ఏర్పాటు, అభివృద్ధి ప్రణాళికకు భారత్ కోట్ చేసిన సొమ్ములపై విభేదాలు నెలకొనడమే ఇందుకు కారణం. అణుఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా ప్రకటించడంతో ఇరాన్ స్థితిగతులు ఒక్కసారిగా మారిపోయాయి. ఫలితంగా వాణిజ్య సంప్రదింపులకు సరైన సమయం దొరకలేదు. ఆ తరవాత ఆ క్షేత్రాన్ని తామే స్వయంగా అభివృద్ధి చేసుకుంటామని, మలివిడతలో భారత్‌ను చేరుస్తామని 2020లో ఇరాన్ అనూహ్య ప్రకటన చేసింది. తాజాగా ఆ కాంట్రాక్టును స్వదేశీ సంస్థకు అప్పగించింది. ఇది భారత్‌కు దక్కి ఉంటే ఇరు దేశాల మధ్య మైత్రి మరింత దృఢంగా మారేది.
చాబహార్‌పై ప్రభావం
ఈ పరిణామాల ప్రభావం చాబహార్ ఓడరేవు ప్రాజెక్టుపైనా పడే అవకాశముంది. ఏడాదిలో పూర్తయ్యే ఈ పోర్టు, భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యం. ఇది భారత్‌ను అఫ్గానిస్థాన్, మధ్యాసియాకు అనుసంధానిస్తుంది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా(సీపెక్)కు దీటుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ఇండియా 50 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడింది. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో వంద కోట్ల డాలర్ల పెట్టుబడులకు హామీ ఇచ్చింది. భద్రతాపరంగా చూస్తే, పాకిస్థాన్ మద్దతుతో అరేబియా సముద్రంలో చైనా నిర్మిస్తున్న గ్వాడార్ పోర్టుకు చాబహార్ ఓడరేవు దీటుగా నిలబడుతుంది. పశ్చిమ అరేబియాలో ఉనికిని పెంచుకోవడంతో పాటు ఆఫ్రికా తీరం వద్ద వాణిజ్య ఓడల భద్రత కోసం నౌకలను ఉంచేందుకు ఉపయోగపడుతుంది. భారత్‌కు ఆ మార్గం నుంచే ఇంధన దిగుమతులు వస్తుండటంతో ఇది ఎంతో కీలకం. కానీ ఇప్పుడు ఇరాన్ వైఖరిలో వచ్చిన మార్పుతో చాబహార్ రేవును వినియోగించుకోవాలన్న భారత్ ప్రణాళికలకు ముప్పు పొంచి ఉంది.
చాబహార్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించారని గత సంవత్సరం నివేదికలు బయటపడ్డాయి. ఇరాన్‌తో చైనా వ్యూహాత్మక బంధం ఏర్పరచుకున్న కొన్ని గంటల తరవాత ఈ వార్త అందడం గమనార్హం. భారత్ ప్రణాళికలపై దెబ్బ కొట్టి, ఆ ప్రాంతం నుంచి వెనక్కి నెట్టేందుకు ఇరాన్‌తో సాన్నిహిత్యాన్ని ఓ అవకాశంగా చైనా భావిస్తోంది. తమ బంధాన్ని మరింత బలపరుస్తూ 2021 మార్చి 27న చైనా-ఇరాన్ పాతికేళ్ల వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా చైనా 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. భవిష్యత్తులో ఇటువంటి ఒప్పందమే సౌదీ అరేబియా, యూఏఈతో కుదుర్చుకోవాలని చైనా చూస్తోంది. ఇది భారత్‌కు ఆందోళనకరమే! చైనా, ఇరాన్‌లు అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ విలవిలలాడుతోంది. చైనా పెట్టుబడులతో ఆ దేశానికి కొంత ఉపశమనం లభించింది. ఈ పరిణామాల ఫలితంగా ఇరాన్‌తో భారత్‌కు ఉన్న వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతిని, మధ్యాసియాలో భారత విదేశాంగ విధానమే ప్రమాదంలో పడే అవకాశముంది.