తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చెలరేగిన వివాదంపై భారత్‌నే తప్పుబట్టే ప్రయత్నం చేసింది చైనా. భారత సైన్యమే వాస్తవాధీన రేఖను దాటి తమ భూభాగంలోకి ప్రవేశించిందని.. చైనా అధికారులపై దాడికి పాల్పడిందని బుకాయించింది. ఇదే అంశంపై స్పందించిన ఆ దేశ విదేశాంగ శాఖ కూడా తమ తప్పును కప్పి పుచ్చుకోవాలని చూసింది. ఏకపక్ష చర్యలకు దిగి సమస్యను మరింత జటిలం చేయకూడదని పేర్కొంది. చైనాతో చెలరేగిన వివాదంలో తమ సిబ్బంది మరణించారన్న దానిపైనా భారత సైన్యాన్ని ఆరా తీసినట్లు తెలిపింది.
" ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత సైన్యమే ఉల్లంఘించింది. సోమవారం భారత సైనికులు రెండుసార్లు సరిహద్దు దాటి చైనా సైన్యంపై దాడికి పాల్పడ్డారు. అది కాస్తా తీవ్ర ప్రత్యక్ష ఘర్షణకు దారితీసింది. సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న భారత సైనికులు వాస్తవాధీన రేఖను దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించకుండా చూసుకోవాలి. ఏకపక్ష ధోరణి నిర్ణయాల వల్ల సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత జటిలమవుతాయి."