చైనా ఎప్పుడు ప్రయాణ ఆంక్షలు సడలిస్తుందో తెలియక.. ఆ దేశంలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది విద్యార్థులంతా స్వదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌లోనే తమ విద్యను కొనసాగిస్తున్నారు. చైనాలో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అన్లైన్ తరగతులు జరుగుతున్నా.. ప్రాక్టికల్స్ లేకపోవడంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు చైనాకు చెందిన చాలా యాప్‌లను భారత్ నిషేధించింది. దీంతో వర్చువల్ ప్రయివేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) ఇన్‌స్టాల్ చేసుకొని విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు కొనసాగిస్తున్నారు.
2019 డేటా ప్రకారం.. దాదాపు 23 వేల మంది విద్యార్థులు చైనాలోని వివిధ విద్యాలయాల్లో చేరారు. ఇందులో 21 వేల మంది ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరోవైపు చైనా విదేశీ విద్యార్థులను తమ దేశంలోకి అనుమతించడం ప్రారంబించింది. అయితే రెండో దశ కొవిడ్ ఉద్ధృతి భారత్‌లో ఎక్కువగా ఉండడంతో.. భారతీయ విద్యార్థులపై మాత్రం ప్రయాణ ఆంక్షలను కొనసాగిస్తోంది. తమను చైనా పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గత నెల 3 వేల మంది విద్యార్థులు ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా విద్యార్థుల ఆందోళనను చైనా అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. త్వరలో చైనాలో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేశం ప్రయాణ అంక్షలు సడలించనుందన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ కల్లా భారతీయ విద్యార్థులు తిరిగి చైనాకు వెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
అధికారుల తీరుపై జిన్‌పింగ్ అసహనం