Indian Airlines hijacker: 1999లో కాఠ్మాండూ నుంచి దిల్లీకి వస్తున్న ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురిలో ఒకడైన మిస్త్రీ జహూర్ ఇబ్రహీం చనిపోయినట్లుగా పాక్ మీడియా తెలిపింది. మార్చి 1న పాకిస్థాన్‌లోని కరాచీలో ఉండే అక్తర్ కాలనీలో ఇబ్రహీంను గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపినట్లు పేర్కొంది. సరిగ్గా తలపై రెండు సార్లు కాల్పులు జరిగినట్లు రాసుకొచ్చింది.
జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇబ్రహీం.. అనేక సంవత్సరాల పాటు కరాచీలోనే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నకిలీ గుర్తింపుతో ఉన్న అతనికి ఐఎస్ఐ భద్రత కల్పించినట్లు పలుసార్లు ఆరోపణలు వచ్చాయి.
1999 డిసెంబర్ 24న నేపాల్ కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణిస్తున్న ఎయిర్ బస్ ఏ300ను ఇబ్రహీంతో పాటు మరో నలుగురు హైజాక్ చేశారు. ఈ ఘటనలో హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే సంస్థ కూడా భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. వీరంతా విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే హైజాక్ చేశారు.