అఫ్గానిస్తాన్‌లో తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి వర్చువల్ విధానంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ప్రసంగించారు. 'భారతదేశానికి అఫ్గాన్ ప్రజలతో చారిత్రక స్నేహం ఉంది. భవిష్యత్తులోనూ అది అలాగే కొనసాగుతుంది. ఇదే భారత్ విధానం' అని జైశంకర్ ఉద్ఘాటించారు. అఫ్గాన్ సంక్షోభం ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావాన్ని చూపుతుందన్నారు.
"నేడు తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. అఫ్గాన్ ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ గతంలో మాదిరే సిద్ధంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం సహకారం అవసరమని నమ్ముతున్నాం. ఎలాంటి అవరోధం లేకుండా అఫ్గాన్‌లోకి ప్రవేశించగలగాలి."